- బీఆర్‌ఎస్ హయాంలో సిరిసిల్ల జిల్లాలో 2వేల ఎకరాలు మాయం
- ఆక్రమణలపై కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్.. ఏడుగురి అరెస్ట్
- ఆక్రమణదారుల్లో గుబులు.. సర్కార్‌కు అప్పగించేందుకు ముందుకు
- కబ్జాకోరుల్లో కదలిక.. ఇప్పటివరకు 280 ఎకరాలు రికవరీ
సిరిసిల్ల, జనవరి 12 (విజయక్రాంతి): ‘ప్రభుత్వ భూమి కనపడితే కబ్జా చేసేయ్’ అన్న విధంగా గత ప్రభుత్వ హయాంలో భూ బకాసురులు రెచ్చిపోయారు. రాజకీయ నేతల అండ దండ లతో భూదాహం తీర్చుకున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు కాదు.. సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా 2 వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు.
కొందరు సదరు భూములను అక్రమం గా పట్టా సైతం చేసుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆక్రమిత భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టింది. జిల్లాయంత్రాంగం భూ కబ్జాలపై కొరడా ఝుళిపించి ఏడుగురు కబ్జాదారులను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టింది.
వీరిలో కొందరు బెయిల్‌పై బయటకు రాగా, మరికొందరు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. వారు ఆక్రమించిన భూములను సైతం ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకున్నది. దీంతో మిగతా కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఇప్పటికే కొందరు కబ్జాదారులు 280 ఎకరాల భూమిని తిరిగి ప్రభుత్వానికి అప్పగించారు.
అరెస్టులు ఇలా..
తంగళ్లపల్లి మండలానికి చెందిన బొల్లి రామ్మోహన్, ఒజ్జాల అగ్గిరాములు, జిందం దేవదాసు, సురభి నవీన్‌రావు, కోడూరి భాస్కర్ గౌడ్ ప్రభుత్వ భూములు ఆక్రమించారని గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎవరైనా ప్రభు త్వ భూములను ఆక్రమించి ఉంటే, వెంటనే తిరిగి సర్కార్‌కు అప్పగించాలని పిలుపునిచ్చారు.
అలా వెనక్కి అప్పగించిన వారిపై ఎ లాంటి కేసులు ఉండవనే సంకేతాలు పం పింది. దీంతో కబ్జాదారుల్లో మిట్టపల్లి పద్మ రెండెకరాలు, సురభి నవీన్‌రావు మూడెకరాలు, సురభి సురేందర్‌రావు మూడెకరా లు, సురభి సుధాకర్‌రావు ఐదెకరాల భూమిని ఇటీవల కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాకు అప్పగించారు.
మరోవైపు ఎస్సీ అ ఖిల్ మహాజన్ కూడా భూఆక్రమణలపై దృ ష్టి సారించారు. తాజాగా శనివారం పోలీసు లు సిరిసిల్ల పట్టణ శివారులోని పెద్దూరు గ్రామంలో ప్రభుత్వ భూమిని అక్రమించుకున్న సలేంద్రి బాలరాజు, గంగుల బాలయ్య ను అరెస్టు చేశారు. వారిపై కేసులు నమోదు చేసి, కోర్టు ఎదుట హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. తప్పు చేస్తే చాలు ఎంతటి వారైనా విడిచిపెట్టేది లేదని ఎస్పీ హెచ్చరిస్తున్నారు.
ఆక్రమణలకు పాల్పడితే చర్యలు
ప్రభుత్వ భూములను అక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే జిల్లాలో ఆక్రమణలకు పాల్పడిన అనేక మందిపై కేసులు నమోదు చేశాం. ఆక్రమణదారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములను అప్పగించాలని కోరుతున్నాం. మా అంతటా మేం ఆక్రమణలను గుర్తిస్తే చర్యలు కఠినంగా ఉంటాయి.
- అఖిల్ మహాజన్, ఎస్పీ, రాజన్న సిరిసిల్ల జిల్లా
భూములను అప్పగించండి
ప్రస్తుతం జిల్లాలో ఆక్రమణలకు గురైన భూ ముల వివరాలను సేకరిస్తున్నాం. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తిరిగి సర్కార్‌కు అప్పగించాలి. అలా చేస్తే వారిపై ఎలాంటి చర్యలు ఉండవు. ఇప్పటికే కొందరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు అప్పగించారు. మిగతా ఆక్రమణదారులు కూడా తిరిగి భూములు అప్పగించాలి. ఆ భూములను నిరుపేదల సంక్షేమం కోసం ఉపయోగిస్తాం.
- సందీప్‌కుమార్ ఝా,
కలెక్టర్ రాజన్న సిరిసిల్ల జిల్లా