calender_icon.png 2 November, 2024 | 2:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిటైర్మెంట్ బెనిఫిట్స్

17-07-2024 03:37:04 AM

టీచర్లకు రూ. 2 లక్షలు, ఆయాలకు లక్ష.. త్వరలో ఉత్తర్వులు: మంత్రి సీతక్క 

హైదరాబాద్, జూలై 16 (విజయక్రాంతి): మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం, తాజాగా మరో పథకానికి శ్రీకారం చుట్టింది. పదవీ విరమణ పొందే అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. రిటైర్ అయ్యే అంగన్‌వాడీ టీచర్లకు రూ.రెండు లక్షలు, హెల్పర్లకు రూ. లక్ష రిటైర్మెంట్ ప్యాకేజీని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్  సీతక్క ప్రకటించారు. మంగళవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమాత్‌నగర్ డివిజన్‌లో అమ్మ మాట అంగన్‌వాడీ బాట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి సీతక్క, ఈ మేరకు అధికారిక ప్రకటన చేసారు.

త్వరలో జీవో విడుదల అవుతుందన్నారు. గత ప్రభుత్వం అంగన్‌వాడీ సిబ్బందిని నమ్మించి మోసం చేసిందని, కానీ  తమ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హమీలను అమలు చేస్తుందని తెలిపారు. అందులో భాగంగా అంగన్‌వాడీ టీచర్లకు రూ. రెండు లక్షలు, ఆయాలకు రూ. లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలనే నిర్ణయం తీసుకున్నామన్నారు. దీనికి సంబంధించి ఆర్థికశాఖ ఫైల్ క్లియర్ చేసిందని, రెండు మూడు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడుతాయని చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్యను పెంచేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మ మాట- అంగన్‌వాడీ బాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అక్షరజ్ఞానంతో పాటు, మానసిక ఉల్లాసం, పౌష్టికాహారం, ఆహ్లాదకర వాతావరణం, భద్రత లభిస్తుందన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా అంగన్‌వాడీ కేంద్రాలను తీర్చిదిద్దుతున్నామని, పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్చించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. మీ పిల్లలను చక్కదిద్దే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. మాతృత్వాన్ని, మానవత్వాన్ని మేలవించి పిల్లల్ని అక్కున చేర్చుకోవాలని అంగన్‌వాడీ సిబ్బందికి సూచించారు. పసిప్రాయం నుంచే చిన్నారులకు విద్యతోపాటు పచ్చదనంపై అవగాహన కల్పించాలని కోరారు.

చిన్నారుల చేత మంత్రి సీతక్క మొక్కలు నాటించారు. మై ప్లాంట్ మై ఫ్యూచర్ అని చిన్నారులతో పలికించారు. తల్లిదండ్రులకు పిల్లలే భవిష్యత్తు అయినట్లుగా, పచ్చదనం, చెట్ల పెంపకం దేశ భవిష్యత్తును నిర్దేశిస్తుందన్నారు మంత్రి సీతక్క. ఈ కార్యక్రమంలో రహమత్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్ కాంతి వెస్లీ తదితర అధికారులు పాల్గొన్నారు.