calender_icon.png 31 January, 2025 | 5:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రొఫెసర్ల రిటర్మైంట్ వయస్సు పెంపు

31-01-2025 12:39:12 AM

60 నుంచి 65 ఏండ్లకు పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు

హైదరాబాద్, జనవరి 30 (విజయక్రాంతి): రాష్ట్రంలోని యూనివర్సిటీల్లోని ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పదవీ విరమణ వయస్సు పెంచుతామని చెప్పిన విషయం తెలిసిందే.

అయితే ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు పెంపు అంశం ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉంది. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో 2,878 పోస్టులకు ప్రస్తుతం 753 మంది పనిచేస్తుండగా 2,125 ఖాళీలున్నాయి. ఇదే విషయాన్ని తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి తన నివేదికలో తెలిపింది. దాదాపు 6 నుంచి 7 వర్సిటీల్లో సరిపడా ప్రొఫెసర్లే లేరు.

గత కొన్నేళ్ళుగా వర్సిటీల్లో రిక్రూట్‌మెంట్ ప్రక్రియ జరగకపోవడంతో ప్రొఫెస ర్లంతా పదవీ విరమణ పొందుతున్నారు. చివరిసారిగా నియామక ప్రక్రియ 2013లో జరిగింది. ప్రతినెలా కొందరు ప్రొఫెసర్లు రిటైర్మెంట్ అవుతున్నారు. శుక్రవారం మరో ఐదుగురు రిటైరవుతున్నట్లు తెలిసింది. ప్రొఫెసర్లు ఇలా రిటైర్ అవుతండటంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందక వర్సిటీలు వెనుకబడుతున్నాయి.

పరిశోధనలపై వర్సిటీలు దృష్టిసారించలేకపోతున్నాయి. దీనిప్రభావం వర్సిటీ ర్యాంకింగ్‌లపై పడుతోంది. పైగా వర్సిటీల్లో నియామకాలు చేపట్టేందుకు మరికొంత సమయం పట్టనున్న నేపథ్యంలో ఉన్నవారినే మరికొంత కాలం కొనసాగించాలని భావిస్తోంది. రిటైర్మెంట్ వయస్సును మరో ఐదేండ్లు పెంచి వీరి సేవలను వినియోగించుకోవాలని ఈ నిర్ణయం తీసుకుంది.

ఇదిలా ఉంటే ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంచుతారనే ప్రచారం కూడా గత కొంత కాలంగా జరుగుతోంది. ఇప్పటికే వారి రిటైర్మెంట్ వయస్సు 58 నుంచి 61 వరకు పెంచిన విషయం తెలిసిందే.