11-04-2025 10:15:08 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ లోకాయుక్తగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎ. రాజశేఖర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ రాజశేఖర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి ఐదు సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. లోకాయుక్తగా ఆయన పదవీకాలంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాను కలిగి ఉంటారు. లోకాయుక్త సంస్థలో ఉప-లోకాయుక్తగా మాజీ జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి జస్టిస్ బి.ఎస్.జగ్ జీవన్ కుమార్ నియమితులయ్యారు. ఈయన ఆ పదవిలో ఐదేళ్లు కొనసాగుతారు. తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (THRC) చైర్‌పర్సన్‌గా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్, మూడు సంవత్సరాల పదవీకాలానికి నియమించారు.
పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి డాక్టర్ బి. కిషోర్ టీహెచ్ఆర్సీ(THRC) సభ్యుడిగా (న్యాయేతర) మూడు సంవత్సరాల కాలానికి నియమితులయ్యారు. పదవీ విరమణ చేసిన సెలక్షన్ గ్రేడ్ జిల్లా న్యాయమూర్తి శివాడి ప్రవీణ టీహెచ్ఆర్సీ(THRC) సభ్యురాలిగా (జ్యుడీషియల్) నియమితులయ్యారు, ఆమె పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి లేదా ఆమెకు డెబ్బై సంవత్సరాల వయస్సు వచ్చే వరకు, ఏది ముందు అయితే అది అమలులోకి వస్తుంది. దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న రాష్ట్ర మానవ హాక్కుల కమిషన్ చైర్మన్, లోకాయుక్త, ఉపలోకాయుక్త పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏప్రిల్ 5వ తేదీన సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన సెలక్షన్ కమిటీ అభ్యర్థుల జాబితాను పరిశీలించి వీరి పేర్లను ఖారారు చేసింది.