calender_icon.png 9 January, 2025 | 1:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిటైరైనా పాతుకుపోయారు!

04-08-2024 03:30:22 AM

  1. అందుకే మిగతా వాళ్లకు పదోన్నతులు లేవు
  2. మురళీధర్‌రావు, గణపతి రెడ్డి, కిషన్‌రావు వల్లే సీఈలకు ఉద్యోగోన్నతి దక్కట్లేదు
  3. అసెంబ్లీ సమావేశాలు మాటల గారడికి పరిమితం 
  4. బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఈఎన్‌సీ పోస్టుల్లో ఉన్న అధికారులు పదవి విరమణ పొందినా పదేళ్లకుపైగా అక్కడే పాతుకుపోవడం వల్ల మిగతా వాళ్లకు పదోన్నతులు రావడం లేదని.. మురళీధర్‌రావు, గణపతిరెడ్డి, కిషన్‌రావు లాంటి వాళ్ల వల్ల సీఈలకు పదోన్నతులు లేకుండా పోయాయని కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి విమర్శించారు. వీరు లేకుండా ఆ పోస్టుల్లో పనిచేసే వాళ్లు లేకుండా పోయారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

సమర్థులైన ఐఏఎస్ అధికారులు ఉన్నా.. ప్రైవేటు వ్యక్తులకు బాధ్యతలు అప్పగిస్తున్నారని, ఆంధ్రా క్యాడర్‌ను తెలంగాణలో కనబడనివ్వమని చెప్పిన సీఎం.. ఇప్పుడు సగం మంది ఆంధ్రా అధికారులతోనే నింపేశారని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలు మాటల గారడీకే పరమితమయ్యాయని దుయ్యబట్టారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గత ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడం తప్ప ప్రజలకు తమ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పలేదని విమర్శించారు. శనివారం  బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పుల పాలైన తెలంగాణలో మూసీ అభివృద్ధి, యంగ్ ఇండియా స్కిల్ ప్రోగ్రాం ఏ విధంగా చేపడతారని ప్రశ్నించారు.

చట్ట సభల్లో సంస్కారవంతంగా వ్యవహరించాలని, బ్లాక్ టికెట్లు అమ్మేవారు కూడా కాస్త పద్ధతిగా ఉంటారని తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ సభ్యుల తీరుతో ప్రజాసమస్యలపై చర్చించే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ర్ట ప్రజల రక్తమాంసాలు, మాన మర్యాదలను మంట గలిపిన నిజాం నవాబు.. సీఎం రేవంత్‌రెడ్డికి గొప్పోడయిపోయాడా? అని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో దానం నాగేందర్ వ్యవహరించిన తీరు దారుణమని, దీన్ని మంత్రులు చోద్యంలా చూశారే తప్ప ఖండించలేదని మండిపడ్డారు. జీహెచ్‌ఎంసీలో యాడ్ స్కాం జరుగుతోందని తెలిసీ ఏ ఒక్కరూ నోరు మెదపలేదని ఆరోపించారు.