- యూనివర్సిటీల్లో ఆచార్యుల అవస్థలు
- 25 ఏళ్లుగా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగానే విధులు
- పర్మనెంట్ కాకుండానే పదవీ విరమణ
- ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్
హైదరాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి): యూనివర్సిటీల్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు అవస్థలు పడుతున్నారు. ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్నా వారికి ఉద్యోగ భద్రత కరువైంది. రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో దాదాపు 1400 మంది వరకు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తున్నారు.
బడ్జెట్ పోస్టుల్లో 955 మంది, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు బోధించేవారు, పార్ట్‌టైం ప్రొఫెసర్లు కలిపి మరో 500 మంది వరకు ఉంటారు. ఒక్కొక్కరూ పదేళ్ల నుంచి 25 ఏళ్లుగా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగానే పనిచేస్తున్నారు. అదే పోస్టులో పదవీ విరమణ సైతం పొందుతున్నారు. తమకు ఉద్యోగ భద్రత కరువైందని వాపోతున్నారు.
యూనివర్సిటీల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండటంతో బడ్జెట్ సాంక్షన్డ్ పోస్టుల్లో విధులు నిర్వర్తిస్తున్న 955 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేసి మిగతా పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
యూజీసీ నిబంధనల ప్రకారం వీళ్ల పోస్టు పెద్దదే అయినా యూజీసీ పే స్కేల్ కూడా వర్తింపచేయడం లేదని వాపోతున్నారు. పీఎఫ్, హెల్త్ కార్డులతోపాటు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందకుండానే పదవీ విరమణ పొందుతున్నారు.
కాంట్రాక్ట్ ఫ్యాకల్టీయే ఎక్కువ
వర్సిటీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లలో ఎక్కు వ మంది కాంట్రాక్ట్, పార్ట్‌టైం వాళ్లే ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో బడ్జెట్ సాంక్షన్డ్, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో కలిపి 364 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండగా, కాకతీయ 180 మంది, జేఎన్టీయూ మంది, ఫైన్‌ఆర్ట్స్ యూనివర్సిటీలో 91 మంది, తెలుగు యూనివర్సిటీలో 20 మంది, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో 22 మంది, శాతవాహనలో 39 మంది, ఎంజీయూలో 49 మంది, తెలంగాణ వర్సిటీలో 53 మంది, పాలమూరు యూనివర్సిటీలో 94 మంది, బాసర ట్రిపుల్ ఐటీలో 129 మంది విధులు నిర్వర్తిస్తున్నారు.
ఇతర రాష్ట్రాల్లో అమలు
యూజీసీ నిబంధనలు పక్క రాష్ట్రాల్లో ఒకలా, తెలంగాణలో ఇంకోలా అమలవుతున్నాయని యూనియన్ నేతలు ఆరోపిస్తు న్నారు. పక్క రాష్ట్రాల్లోని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను ఆయా ప్రభుత్వాలు రెగ్యులరైజ్ చేశా యి. పశ్చిమ బెంగాల్, ఢిలీ, పంజాబ్, మణిపూర్, కర్ణాటక, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్‌లోని ఆంధ్ర యూనివర్సిటీలోనూ అసిస్టెంట్ ప్రొఫెసర్లను ఏళ్ల క్రితమే క్రమబద్ధీకరించారు.
కానీ, మన దగ్గర మాత్రం 10.. 20.. 25 ఏళ్లుగా పనిచేస్తున్నా అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయడంలేదని యూనియన్ నేతలు వాపోతున్నారు. కర్ణాటక వర్సెస్ ఉమాదేవి కేసులో సుప్రీం కోర్టు 2006లో ఓ తీర్పును వెలువరించింది. పదేళ్లు, అంత కంటే ఎక్కువ సర్వీస్ ఉంటే వారిని రెగ్యులర్ చేయాలని పేర్కొంది.
మరో కేసులో కాంట్రాక్ట్ కింద ఎవరినీ ఉద్యోగాల్లో తీసుకోవద్దని కూడా ఆదేశించింది. ఆ తీర్పు ప్రకారం తమను కూడా రెగ్యులరైజ్ చేయాలని యూనియన్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల రెగ్యులరైజ్ అంశానికి సంబంధించి హైకోర్టులో పలు కేసులు విచారణలో ఉన్నాయి.
హామీలతోనే సరి
రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు తమ రెగ్యులరేజన్‌ను హామీలతోనే సరిపెడుతున్నాయని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు వాపోతున్నారు. 2014 ఎన్నికలప్పుడు బీఆర్‌ఎస్ తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో కాం ట్రాక్ట్ ఉద్యోగులందరిని క్రమబద్ధీకరించి కాం ట్రాక్టు అనే పదం లేకుండా చేస్తామని ఇచ్చి న హామీని అమలు చేయలేదని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ అయినా కాంట్రాక్ట్ అసి స్టెంట్ ప్రొఫెసర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రేవంత్ సర్కార్‌ను డిమాండ్ చేస్తున్నారు. తమను రెగ్యులరైజ్ చేయకుం డా వర్సిటీల్లోని పోస్టులను భర్తీ చేయొద్దని ప్రభుత్వాన్ని విజ్ఞప్తిచేస్తున్నారు.
మమ్మల్ని పర్మినెంట్ చేయాలి
కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలి. రెగ్యులర్ చేసేంతవరకు యూజీసీ పే స్కేల్ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. సమాన పనికి సమాన వేతనం వర్తింపచేయాలి. మాకు సమానమైన పోస్టులు పక్కనబెట్టి మిగతా పోస్టులకు మాత్రమే ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలి. మెడికల్ కాలేజీల్లో చేసినట్టు తమ పదవీ విరమణ వయస్సు పెంపు 65 ఏళ్ల వరకు పొడిగించాలి. రెగ్యులర్ ప్రొఫెసర్లుగానే మాకు కూడా అర్హత ఉన్నవారికి పీహెచ్‌డి గైడ్ షిప్ ఇవ్వాలి.
డాక్టర్ ఏ పరుశురామ్,
యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
యూజీసీ స్కేల్ వర్తింప చేయాలి
మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. ఆ ప్రక్రియ ఆలస్యమైతే అప్పటివరకు మాకు యూజీసీ స్కేల్ అమలు చేయాలి. ముఖ్యంగా ఉద్యోగ భద్రత కల్పించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.25 లక్షలు ఇవ్వాలి. ఇరవై ఏళ్లపాటు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగానే పనిచేసి రిటైరవుతున్నాం.
డాక్టర్ ఆనంద్, ఉస్మానియా యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్