- పుట్టగొడుగుల్లా పత్తి కొనుగోలు కేంద్రాలు
- పట్టించుకోని అధికారులు
- దగా పడుతున్న పత్తి రైతులు
ఇల్లెందు, నవంబర్ 22: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గంలో పత్తి రైతులు దగాపడుతున్నారు. ప్రకృతి సహకరించకపోవడంతో దిగుబడి అంతంత మాత్రమే వచ్చింది. దీనికి తోడు సీసీఐ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ధర తగ్గినా ప్రైవేటుకు అమ్ముతూ రైతులు నష్టపోతున్నారు.
ప్రైవేటు వ్యాపారులు ఇష్టా నుసారంగా ధరలు తగ్గించి దోచుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇల్లెం దు నియోజకవర్గంలో ప్రతీ సీజన్‌లో చిల్లర కౌంటర్ల జాతర మొదలవుతుంది.
నియోజకవర్గంలో పత్తి కొనుగోలు కేంద్రం లేకపోవ డంతో దళారులదే ఇష్టారాజ్యం అవుతోంది. పంట చేతికి రావడం మొదలవ్వగానే వ్యాపారుల ఇళ్లముందే కాంటాలు ఏర్పాటు చేసు కుంటారు. అయినా మార్కెటింగ్ శాఖ అధికారులకు ఏమీ పట్టింపు ఉండదు.
పర్యవేక్షణ లేక ఇష్టారాజ్యం
మార్కెటింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నియోజకవర్గంలో ఒక్కొక్కటిగా చిల్లర కౌంటర్లు ఏర్పడుతున్నాయి. యూరియా బస్తాల్లో పత్తిని తీసుకొచ్చిన రైతులను బస్తా తరుగు, తేమ పేరుతో మోసం చేస్తున్నారు. ధరలోనూ దగా చేస్తున్నారు. యూరియా బస్తా సంచిలో 20 కిలోల పత్తి వస్తుంది. దీనికి బస్తా కింది కిలో పత్తి తరుగు తీస్తున్నారు. మార్కెట్‌లో ఉన్న ధర కూడా నిర్ణయించడంలేదు.
నాణ్యత నెపంతో రైతుకు కుచ్చు టోపీ పెడుతున్నారు. మరోవైపు పెట్టుబడి పేరుతో రైతులకు అదే వ్యాపారులు విత్తనాలు, ఎరువులు అప్పుగా ఇస్తారు. అప్పుడు మార్కెట్ ధరకంటే ఎక్కువకు విక్రయిస్తారు. పంట చేతికి వచ్చిన తర్వాత దానిపై వడ్డీని వసూలు చేస్తుంటారు. అంతటితో ఆగకుండా ఆ రైతు పండించిన పంట మొత్తం తనకే అమ్మాలనే షరతులు విధించడం గమనార్హం.
ఇంత జరుగుతున్నా అటు వ్యవసాయ అధికారులుగానీ, మార్కెటింగ్ అధికారులుగానీ ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుంటారు. అన్ని కౌంటర్లు ఏర్పాటు అయిన తర్వాత కౌంటర్లలోని కాంటాలు తీసుకెళ్లి కేసులు పెడతామని బెదిరించి తర్వాత తాత్కాలిక లైసెన్సులు జారీ చేసి చేతులు దులుపుకుంటారు. ఇన్ని అక్రమాలకు స్థానికంగా సీసీఐ కేంద్రం లేకపో వడమే కారణమని రైతులు వాపోతున్నారు.
నాలుగేళ్ల క్రితం కొనుగోలు కేంద్రం
ఇల్లెందు నియోజకవర్గం కేంద్రంలో ఉన్న వ్యవసాయ మార్కెట్‌లో నాలుగు సంవత్సరాల క్రితం సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పత్తి రావడం లేదనే సాకుతో ఎత్తివేశారు. అప్పటి నుంచి అధికారులు, మార్కెటింగ్ శాఖ వారు సీసీఐ కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేయలేదు. అదే దళారుల పాలిట వరంగా మారింది.
రైతుల ఆవసరాలను ఆసరగా చేసుకుని వ్యాపారులు ఇష్టమున్న రేట్లు నిర్ణయించి రైతులను దగా చేస్తున్నారు. ఈసారి సీజన్ ఆరంబంలో ఆశించిన వర్షాలు కురియక, తర్వాత అధిక వర్షాల కారణంగా ఆశించిన దిగుబడి రాలేదు. పెట్టుబడి వస్తుందో రాదో అనే దిగులుతో ఉన్న రైతులు చేతికందిన పంటను వెంట వెంటనే అమ్మేందుకు మొగ్గు చూపుతున్నారు. అదే అదనుగా దళారులు దండుకుంటున్నారు.
సీసీఐ కేంద్రం ఏమైంది?
ఇల్లెందు వ్యవసాయ మార్కెట్‌లో సీసీఐ కేంద్ర ఏర్పాటు ఏమైం దని రైతులు ప్రశ్నిస్తున్నారు. కొన్ని ఏళ్ల కిత్రం పెట్టి తర్వాత తొలగించినా మళ్లీ ఏర్పాటు దిశలో మార్కె టింగ్ శాఖ ప్రయత్నాలు చేయకపోవడంలో మతలబేంటని వారు అం టున్నారు. ఇల్లెందు మార్కెట్ పరిదిలో ఇల్లెందు, టేకులపల్లి, గుం డాల, గార్ల, బయ్యారం, ఆళ్లపల్లి, కారేపల్లి మండలాలున్నాయి.
అన్ని మండలాల్లో పత్తి సాగు పెద్ద ఎత్తునే చేస్తుంటారు. గతంలో టేకులపల్లి గోదాముల వద్ద పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్న అధికారుల హామీ ఆచరణకు నోచుకో లేదు. ఇప్పటికైనా మార్కెటింగ్ అధికారులు నిద్రమత్తును వీడి రైతులు పూర్తిగా నష్ట పోకముందే సీసీఐ కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాల్ని అవసరం ఉంది.