13-07-2024 12:23:18 AM
న్యూఢిల్లీ, జూలై 12: ఆహారోత్పత్తులు, ప్రత్యేకించి కూరగాయల ధరలు మంటెక్కిపోవడంతో దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు నెలల గరిష్ఠానికి చేరింది. జూన్ నెలలో వినిమయ ధరల సూచి (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 5.08 శాతానికి పెరిగినట్టు శుక్రవారం కేంద్ర గణాంకాల శాఖ వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 5.09 శాతం నమోదైన ద్రవ్యోల్బణం క్రమేపీ తగ్గుతూ వచ్చింది.
2024 మే నెలలో ఇది 4.8 శాతంకాగా, గత ఏడాది జూన్‌లో 4.87 శాతం. తాజా గణాంకాల ప్రకారం 2024 జూన్ నెలలో ఆహారోత్పత్తుల ధరలు వార్షిక ప్రాతిపదికన 9.36 శాతం పెరిగాయి. మే నెలలో ఈ పెరుగుదల 8.69 శాతం. జూన్‌లో ఫుడ్ బాస్కెట్‌లో అత్యధికంగా కూరగాయల ద్రవ్యోల్బణం 29.32 శాతం ఎగిసింది. పప్పు దినుసులు, సంబంధిత ఉత్పత్తుల ధరలు 16.07 శాతం పెరిగాయి. తృణధాన్యాలు, పండ్ల ధరలు సైతం ఈ ఏడాది జూన్ నెలలో గత ఏడాది జూన్‌తో పోలిస్తే అధికమయ్యాయి.
గ్రామాల్లో అధికం
రిటైల్ ద్రవ్యోల్బణం పట్టణాల్లోకంటే గ్రామాల్లో అధికంగా ఉన్నది. గ్రామీణ ప్రాం తాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.66 శాతంకాగా, పట్టణాల్లో ఇది 4.39 శాతమని గణాంకాల శాఖ తెలిపింది. ఆహారోత్పత్తుల, పానీయాల ద్రవ్యోల్బణం 8 శాతాన్ని మించడంతో జూన్ లో ద్రవ్యోల్బణం పెరిగిందని, ముఖ్యంగా మే నెలకంటే జూన్‌లో కూరగాయల ధరలు మరింత పెరిగాయని ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అతిది నాయర్ చెప్పారు. ఆహార పదార్థాలు, పానీయాలు మినహాయిస్తే ఇతర ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 4 శాతం దిగువనే ఉన్నదన్నారు.