calender_icon.png 10 October, 2024 | 1:51 PM

ఐటీ కంపెనీల ఫలితాలు మెరుగు

03-10-2024 12:00:00 AM

విశ్లేషకుల అంచనా

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: ఈ జూలై ద్వితీయ త్రైమాసికంలో సాఫ్ట్‌వేర్ సర్వీస్ కంపెనీలు మెరుగైన ఆర్థిక ఫలితాల్ని వెల్లడిస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత మూడు నెలల్లో ఐటీ కంపెనీల వ్యాపారం ఊపందుకున్నదని, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ వెర్టికల్స్ నుంచి డీల్స్ పుంజుకున్నాయని, ఉత్తర అమెరికాలో బిజినెస్ సెంటిమెంట్ మెరుగుపడిందని వారు తెలిపారు.

ఐటీ రంగం క్యూ2 ఫలితాలు మెరుగ్గా ఉంటాయని, ఉత్తర అమెరికా నుంచి వృద్ధికి ఊతాన్ని ఇచ్చే  ఏడబ్ల్యూఎస్/అజూర్/గూగుల్ క్లౌడ్ వ్యాపారాల్లో మూమెంటం పెరిగిందని, హెల్త్‌కేర్ వెర్టికల్ నుంచి వ్యాపారం మందగించిందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తాజా నివేదికలో పేర్కొంది.

అమెరికాలో బీఎఫ్‌ఎస్ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్) విభాగంలో గ్రీన్‌షూట్స్ కన్పిస్తున్నాయని, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ డీల్స్ పెరిగాయని, ఈ అంశాలతో దేశీయ ఐటీ కంపెనీల పనితీరు పుంజుకుంటుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ వివరించింది. 

ఆదాయ వృద్ధిలో ఇన్ఫీ, ఎల్‌టీఐమైండ్ ట్రీలు టాప్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై త్రైమాసికంలో పెద్ద కంపెనీల్లో ఆదాయ వృద్ధిని ఇన్ఫోసిస్, ఎల్‌టీఐ మైండ్‌ట్రీలు అధికంగా సాధిస్తాయని మెజారిటీ విశ్లేషకులు అంచనా వేశారు. మిడ్‌టైర్ కంపెనీల్లో కఫోర్జ్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్‌లు ఎక్కువ ఆదాయ వృద్ధిని కనపరుస్తాయని వారి అంచనాల్లో పేర్కొన్నారు. భవిష్యత్ డిమాండ్ అంచనాలు చాలావరకూ తొలి త్రైమాసికం తరహాలోనే కంపెనీలు వెల్లడించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇన్ఫోసిస్ తొలి త్రైమాసికంతో పోలిస్తే ద్వితీయ త్రైమాసికంలో 2.5 శాతం ఆదాయ వృద్ధిని సాధించవచ్చని అంతర్జాతీయ బ్రోకరేజ్ జెఫ్పారిస్ అంచనా వేసింది. కఫోర్జ్ 2.7 శాతం క్వార్టర్ ఆన్ క్వార్టర్ రెవిన్యూ వృద్ధిని కనపర్చవచ్చని పేర్కొంది. అయితే విప్రో, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రాల ఆదాయ వృద్ధి ఫ్లాట్‌గా ఉండవచ్చని జెఫ్పారిస్ పేర్కొంది.

మొత్తంమీద దేశీయ ఐటీ రంగంక్యూ2లో 1.3 శాతం  ఆదాయ వృద్ధిని సాధించవచ్చని, కఫోర్జ్, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, ఇన్ఫోసిస్‌లే మొత్తం ఐటీ రంగం వృద్ధిని డ్రైవ్ చేస్తాయని జెఫ్పారిస్ తాజా నివేదికలో వివరించింది. ఇన్ఫోసిస్ ఆదాయ వృద్ధిలో 0.8 శాతం మేర ఆ కంపెనీ ఇటీవల టేకోవర్ చేసిన ఇన్‌టెక్‌తో ఒనగూడుతుందని అంచనా వేసింది.

ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్ డీల్ పొందిన నేపథ్యంలో టీసీఎస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఆదాయ వృద్ధి 1.2 శాతం మేర ఉండవచ్చని పేర్కొంది. అయితే తక్కువ మార్జిన్లు ఇచ్చే బీఎస్‌ఎన్‌ఎల్ డీల్, లెర్నింగ్, డెవలప్‌మెంట్ విభాగాల్లో పెట్టుబడుల కారణంగా టీసీఎస్ లాభాల మార్జిన్లు 0.3 శాతం తగ్గవచ్చని బ్రోకరేజ్ అంచనాల్లో వివరించింది.

ఇన్ఫోసిస్, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్‌లు లాభాల మార్జిన్లు పెరుగుతాయని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ విశ్లేషకులు అంచనా వేశారు. వేతన పెంపు కారణంగా కఫోర్జ్, టీసీఎస్‌ల మార్జిన్లు తగ్గుతాయని విశ్లేషకులు ఒక నోట్‌లో పేర్కొన్నారు. 

10 నుంచి ఫలితాల సీజన్ ప్రారంభం

సాఫ్ట్‌వేర్ సర్వీసుల రంగంలో మార్కెట్ లీడర్ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అక్టోబర్ 10న ఫలితాలను ప్రకటించడం ద్వారా క్యూ2 సీజన్‌ను ప్రారంభిస్తుంది. దేశంలో మూడో పెద్ద ఐటీ కంపెనీ అయిన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఫలితాలు అక్టోబర్ 14న వెలువడతాయి. ద్వితీయస్థానంలో ఉన్న ఇన్ఫోసిస్ అక్టోబర్ 14న, నాల్గవ స్థానంలో ఉన్న విప్రో అక్టోబర్ 17న ఆర్థిక ఫలితాల్ని ప్రకటిస్తాయి.

యూఎస్‌లో రేట్ల కోత సైకిల్ మొదలైనందున, నవంబర్‌లో అక్కడి అధ్యక్ష ఎన్నికల తర్వాత అమెరికా కార్పొరేట్లు నిర్ణయాలు తీసుకుంటారని, ఈ కారణంగా 2025 జనవరి-ఫిబ్రవరి నెలల నుంచి ఐటీ కంపెనీలకు డిమాండ్ మెరుగుదల కన్పిస్తుందని జపాన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ నోమురా  ఒక నివేదికలో వివరించింది. తమ దృష్టిలో జనరేషన్ ఏఐ అడాప్షన్ వచ్చే 12-18 నెలల్లో ఊపందుకుంటుందని, క్లౌడ్ సర్వీసులు, డేటా స్టాండర్డుజేషన్ సేవలకు డిమాండ్ పెరుగుతుందని నోమురా విశ్లేషకులు అంచనా వేశారు.