రెండు రాష్ట్రాల్లో ఆలస్యం
న్యూయార్క్, నవంబర్ 8: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ స్పష్టమైన ఆధిక్యం చాటుకొన్నా.. ఇంకా చిక్కుముడి మాత్రం వీడలేదు. అక్కడి ఆరిజోనా, నెవడాలో ఇంకా తుది ఫలితాలు వెలువడకపోవడమే ఇందుకు కారణం. నెవడాలో 6, ఆరిజోనాలో 11 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. నెవడాలో 2 దశాబ్దాల తర్వాత రిపబ్లికన్ల గాలి వీస్తుండగా, ఆరిజోనాలో గత రెండు ఎన్నికల్లో విభిన్న ఫలితాలు వచ్చాయి. నెవడాలో 94 శాతం ఓట్ల కౌంటింగ్ పూర్తకాగా రిపబ్లికన్లకు 51 శాతం, డెమొక్రాంట్లకు 47.2 శాతం ఓట్లు లభించాయి. ఆరిజోనాలో 70 శాతం కౌంటింగ్ పూర్తికాగా అందులో ట్రంప్ 52.3 శాతం, కమల 46.8 శాతం ఓట్లు సాధించారు.
జాప్యం ఎందుకు?
ఆరిజోనాలో చాలామంది మెయిల్ ద్వారా ఓట్లు వేశారు. వీటిని లెక్కించేందుకు కనీసం 10 రోజులు పడుతుందని అధికారులు వెల్లడించారు. నెవడా రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్లు శనివారం కౌంటింగ్ కేంద్రాలకు చేరుతాయి. పోస్టల్ బ్యాలెట్ల సమస్యలను పరిష్కరించుకోడానికి నవంబర్ 12 వరకు తుది గడువు ఉంది.