calender_icon.png 29 January, 2025 | 4:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ కార్మిక సంఘాలపై ఆంక్షలు ఎత్తేయాలి

21-11-2024 03:13:06 AM

తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి

సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కాముని గోపాలస్వామి

సిద్దిపేట, నవంబర్20: ఆర్టీసీ కార్మిక సంఘాలపై 2019 డిసెంబర్ నుంచి విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని, తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కాముని గోపాలస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సిద్ధిపేట ఆర్టీసీ డిపో ముందు ధర్నా నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ నిర్వహణలో కార్మిక సంఘాలకు భాగస్వామ్యం కల్పించాలని, ప్రజాతంత్ర హక్కులు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

ఆర్టీసీ కార్మికుల ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం కార్మిక ఉద్యమంపై ఆంక్షలు విధించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీలో యూనియన్ కార్యకలాపాలకు అనుమతిస్తామని హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి 11 నెలలు పూర్తయినా ఇంతవరకు హామీని నిలబెట్టుకోలేదన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాళ్లబండి శశిధర్, ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి జాలిగాపు శిరీష, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్ పాల్గొన్నారు.