- భక్షికుంట, రేగులకుంటను అభివృద్ధి చేస్తాం
- లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగవాడ్ సహకారం తీసుకుంటాం
- హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 18 (విజయక్రాంతి): శేరిలింగంపల్లి జోన్ చందానగర్ డివిజన్ పరిధిలోని భక్షికుంట, రేగులకుంట చెరువుల పునరుద్ధరణ బాధ్యతను హైడ్రా.. లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన ఆనంద్ మల్లిగవాడ్‌కు చెందిన సంస్థకు అప్పగించింది.
ఈ చెరువులను ఆనంద్ మల్లిగవాడ్ పునరుద్ధరించడంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తన అధికారుల బృందం, ఆనంద్ మల్లిగవాడ్‌తో కలిసి సోమవారం ఆ చెరువులను పరిశీలించారు. సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ స్థానిక ప్రజలు, కార్పొరేటర్ సహకారంతో ఆనంద్ మల్లిగవాడ్ భక్షికుంట, రేగులకుంట చెరువులను పునరుద్ధరించినట్లు తెలిపారు.
చెరువుల్లోకి మురుగు నీరు చేరకుండా మళ్లించిన తీరును పరిశీలించినట్లు చెప్పారు. అపర్ణ హిల్ రాక్ గేటెడ్ కమ్యూనిటీలో నివాసితులు ఎస్‌టీపీ ద్వారా మురుగు నీటిని శుద్ధి చేసి కాలువలోకి మళ్లించడం అభినందనీయమన్నారు. మురుగు నీటిని శుద్ధి చేయడం ద్వారా దీప్తీ శ్రీనగర్‌లోని రేగులకుంట చెరువులో నీరు స్వచ్ఛంగా కనిపిస్తున్నాయన్నారు.
ఆనంద్ మల్లిగవాడ్ ఫౌండేషన్ సహకారంతో మొదటి దశలో మరో 10 చెరువులను పునరుద్ధరించనున్నట్లు స్పష్టం చేశారు. చెరువులతో పాటు వివిధ కాలనీల్లో పార్కుల కోసం, ఇతర ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాలను కాపాడతామని ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు.
దీప్తి శ్రీనగర్‌లో స్థలాన్ని కాపాడండి..
దీప్తి శ్రీనగర్‌లో ప్రజల అవసరాలకు కేటాయించిన 5 వేల గజాల స్థలాన్ని కబ్జా కు గురికాకుండా చర్యలు చేపట్టాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను స్థానికులు కోరారు. ఈ స్థలాన్ని కొందరు ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించేలా స్థానిక నాయకులు కుట్రలకు పాల్పడుతున్నారని హైడ్రా కమిషనర్‌కు వివరించారు. ఈ కార్యక్రమంలో లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగవాడ్, హైడ్రా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పర్యావరణహితంగా తీర్చిదిద్దుతాం
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, పీసీబీ సెక్రటరీ జీ రవి
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 18 (విజయక్రాంతి): నగరంలో చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ చర్యలు చేపట్టింది హైడ్రా. తాజాగా చెరువులు పారిశ్రామిక వ్యర్థాలతో కలుషితం కాకుండా ఉండేలా ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో పీసీబీ కార్యాలయంలో సెక్రటరీ రవితో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సోమవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
కాలువల్లోకి పారిశ్రామిక వ్యర్థాలు డంప్ చేయకుండా హైడ్రా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు స్థానిక ప్రజలు, పర్యావరణవేత్తలు, విద్యార్థులతో చెరువుల పరిరక్షణ కమిటీలను నియమించి వారి భాగస్వామ్యంతో కాలుష్యానికి చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, పీసీబీ సెక్రటరీ జీ రవి తెలిపారు.