calender_icon.png 23 December, 2024 | 5:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోమాతకు గౌరవం

01-10-2024 12:00:00 AM

మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలషెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించవచ్చంటూ వార్తలు వస్తున్న తరుణంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవాళీ ఆవును ‘ రాజ్యమాతగోమాత’గా ప్రకటించింది. సోమవారం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

వేదకాలంనుంచి భారతీయ సంస్కృతిలో ఆవులకున్న ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి  షిండే తెలిపారు. మానవ పోషణలో దేశవాళీ ఆవుల పాత్ర ఎంతో కీలకం. వాటి పాల ప్రాధాన్యత, ఆయుర్వేద, పంచగవ్య చికిత్సలు, సేంద్రీయ వ్యవసాయంలో ఆవు ఎరువుల వినియోగం..ఇలా  ఎన్నో రకాలుగా దేశవాళీ ఆవులు ఉపయోగపుతున్నాయి.

భారతీయులు వేలాది సంవత్సరాలుగా ఆవులను గోమాతగా పూజిస్తూ వాటిని ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. అయితే ఇటీవలి కాలంలో దేశవాళీ ఆవుల సంఖ్య క్రమేపీ తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. అందువల్ల దేశవాళీ ఆవులను పరిరక్షించడానికి చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతయినా ఉంది.రాష్ట్ర వ్యవసాయం, పాడి పరిశ్రమాభివృద్ధి,పశు సంవర్ధకాలలో వీటి ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం షిండే తెలిపారు.

అంతేకాకుండా దేశీయ ఆవులను గోశాలలో పెంచే వారికి రోజుకు రూ.50 సబ్సిడీ ఇచ్చే పథకాన్ని  కూడా మంత్రివర్గం ఆమోదించింది. 2019 పశుగణన ప్రకారం రాష్ట్రంలో దేశీయ గోవుల సంఖ్య 20.69 శాతం తగ్గిపోవడంతో రాష్ట్రప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ఈ సబ్సిడీ పథకాన్ని అమలు చేయడానికి ప్రతి జిల్లాలో జిల్లా స్థాయి వెరిఫికేషన్  కమిటీలను ఏర్పాటు చేస్తారు.

గోశాలల్లో దేశీయ ఆవులను పెంచే వారికి రాష్ట్రప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ చెప్పారు. గతంలో ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గో వధను, గోమాంసం విక్రయాన్ని నిషేధిస్తూ  ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. కాగా దేశవాళీ గోవును రాజ్యమాతగా, గోమాతగా ప్రకటిస్తూ ఓ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటి సారి.

జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద గో రక్షా ఉద్యమంలో భాగంగా ఇటీవల దేశవ్యాప్త పర్యటన చేపట్టిన నేపథ్యంలో గోమాత పరిరక్షణ అంశం  యావద్భారతంలో ఓ చర్చనీయాంశంగా మారింది.  పీఠాధిపతులు, మఠాధిపతులతో పాటుగా రాజకీయ పార్టీలు సైతం గో రక్షా ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చినప్పటినుంచి గో రక్షణకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు కూడా. మరో వైపు రాజస్థాన్‌లో  ఆలనాపాలనా చూసే వారు లేక ఆవులు రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుండడంపై రాష్ట్ర హైకోర్టు సైతం గతంలో ఆగ్రహం వ్యక్తం చేసింది.

కొన్ని పార్టీలు బహిరంగంగా గోరక్షణ విషయంలో మద్దతుగా నిలుస్తుంటే మరి కొన్ని పార్టీలు ఇష్టం ఉన్నా లేకున్నా దీనికి అండగా నిలుస్తున్నాయి.హిందువుల మనోభావానికి సంబంధించిన ఈ అంశాన్ని వ్యతిరేకిస్తే ఆవర్గాలు ఎక్కడ దూరమవుతాయోనన్న భయం ఆ పార్టీలది. 

మహారాష్ట్రలో అధికారంలో ఉన్నది హిందుత్వ వాది పార్టీలయిన శివసేన, బీజేపీలే కావడంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వర్గాల ఓట్లను మరింతగా పటిష్టం చేసుకునేందుకు పన్నిన ఎన్నికల గిమ్మిక్కు అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నప్పటికీ హిందుత్వ వాదులు మాత్రం రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల పూర్తి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకోవలసిందని, ఆలస్యంగానైనా  షిండే ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని వారంటున్నారు. మరి ప్రతిపక్ష కూటమి అధికార కూటమి నిర్ణయంపై ఏ విధంగా స్పందిస్తుందో, త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కూటమికి ఇది ఏ మేరకు ఓట్లు తెచ్చిపెడుతుందో వేచి చూడాలి.