11-03-2025 08:18:11 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలో ఎల్ఆర్ఎస్ కింద వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఎల్‌ఆర్‌ఎస్ (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) దరఖాస్తుల పరిష్కారంపై పంచాయతీ, మున్సిపల్ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఈ నెల 31వ తేదీలోపు పూర్తి ఫీజు చెల్లిస్తేనే 25 శాతం రాయితీ వర్తిస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 46వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే అధికారులకు దరఖాస్తుల పరిష్కారంపై అవగాహన, శిక్షణలు అందించడం జరిగిందని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఎల్ఆర్ఎస్ ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, లోకల్ టీవీ ఛానల్ లలో ప్రచారం నిర్వహించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలలో టాంటాం నిర్వహించాలని సూచించారు. దరఖాస్తుల పరిష్కారంపై రోజువారి రిపోర్టులను అందజేయాలన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం త్వరితగతిన జరిగి, ప్రజలకు లబ్ధి చేకూరేలా చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్ గౌడ్, రాజేష్ కుమార్, ఎంపీఓ లు, పంచాయతీ కార్యదర్శులు, టౌన్ ప్లానింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.