calender_icon.png 28 February, 2025 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివాదాలను పరిష్కరించండి

28-02-2025 01:47:45 AM

  1. సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మార్ ప్రాపర్టీస్ సంస్థ ప్రతినిధులు 
  2. కీలక భేటీకి హాజరైన మంత్రి శ్రీధర్‌బాబు, సీఎస్.. 
  3. న్యాయ నిపుణులతో కమిటీ ఏర్పాటుకు సీఎం ఆదేశం

హైదరాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): తమ ప్రాజెక్టుల వివాదాలను పరిష్కరించాలని దుబాయ్ కేంద్రంగా పనిచేసే ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ ఎమ్మార్ ప్రాపర్టీస్ సంస్థ రాష్ర్ట ప్రభుత్వా న్ని ఆశ్రయించింది. గురువారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మార్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ ప్రాజెక్టులపై ఉన్న కేసుల వివరాలను ఎమ్మార్ ప్రతినిధులు వివరించారు.

ఎమ్మార్ ప్రతినిధులతో జరిగిన చర్చల సందర్భంగా గతంలో ఏం జరిగింది? ఈ కంపెనీ ప్రాజెక్టులపై ఉన్న కేసులు ఏంటి? అనే విషయాలను అధికారులు సీఎంకు వివరించారు. 2001లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మార్ ప్రాపర్టీస్ హైదరా బాద్‌లో కన్వెన్షన్ సెంటర్, హోటల్,  గోల్ఫ్ కోర్సు, విల్లాలు  తదితర ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు నాటి చంద్రబాబు ప్ర భుత్వంతో ఒప్పందాలు చేసుకుంది.

అనంతరం ఆ ఒప్పందాల్లో అక్రమాలు జరిగా యని అప్పట్లో సీబీఐ, ఈడీ కేసులు నమో దు చేశాయి. ఏజెన్సీల దర్యాప్తులు, కోర్టుల్లో విచారణలు కొనసాగుతున్నాయి. తెలంగాణ వచ్చి తర్వాత 2015 అక్టోబర్‌లో అప్పటి కేసీఆర్ సర్కారు ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు సంబం ధించిన ప్రాజెక్టుల వివాదాల పరిష్కారానికి ఛీప్ సెక్రెటరీ సారధ్యంలో ఐదుగురు సెక్రెటరీలతో కమిటీని ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో కేంద్ర విదేశాంగ శాఖ, సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా దీనిపై రాష్ర్ట ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు.  

డాక్యుమెంట్లను పరిశీలించండి

ఎమ్మార్ ప్రాపర్టీస్ ప్రాజెక్టుల కేసులను క్షుణ్ణంగా పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి, దర్యాప్తు ఏజెన్సీల కేసులు, ఛార్జీషీట్లు, న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉన్నందున ఒప్పందాల డాక్యుమెంట్లు, కోర్టు కేసుల వివరాలతో పాటు కేంద్ర ప్రభుత్వ సూచనలన్నీ పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారాన్ని పరిష్కరించేందుకు 2015లో చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి అదనంగా న్యాయ నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలన్నారు.

న్యాయ వివాదాలను అధ్యయనం చేయడానికి, సామరస్య పూర్వక పరిష్కారం చేసుకోవడానికి యూఏఈ ప్రభుత్వ ఆమోదంతో ఒక లీగల్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తామని ఎంఆర్ సంస్థ ప్రతినిధులు ప్రతిపాదించగా.. సీఎం అందుకు అంగీకరించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీ వారితో సంప్రదింపులు జరిపి తదుపరి సూచనలు, సలహాలు అందిస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ సమావేశంలో ఎంఆర్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ మహమ్మద్ అలబ్బర్, భారత్‌లో యూఏఈ మాజీ రాయబారి డాక్టర్ అహ్మద్ అల్ బన్నా, ఎమ్మార్ గ్రూప్ సీఈవో అమిత్ జైన్, ఆ కంపెనీ ఇంటర్నేషనల్ అఫైర్స్ హెడ్ ముస్తఫా అక్రమ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి,  టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి పాల్గొన్నారు.