26-04-2025 05:26:59 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టం-2025 ద్వారా రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే(District Collector Venkatesh Dhotre) అన్నారు. శనివారం తిర్యాణి మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలలో భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టంపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ఎమ్మెల్సీ దండే విఠల్, ఆర్డీవో లోకేశ్వర్ రావులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వం అంబేద్కర్ జయంతి రోజున ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భూభారతి నూతన చట్టంలో పొందుపరిచిన అంశాలు, హక్కుల ద్వారా రైతుల సమస్యలు పరిష్కరించేందుకు అవకాశం ఉందని, తద్వారా ఎంతోమంది రైతుల సమస్యలు పరిష్కరించబడతాయని తెలిపారు.
చట్టంలో కీలకమైనది అప్పీలు వ్యవస్థ అని, ఎవరైనా రైతుకు అన్యాయం జరిగినట్లయితే ఆపిల్ వ్యవస్థ ద్వారా న్యాయం పొందవచ్చని తెలిపారు. తహసిల్దార్, రాజస్వ మండల అధికారి, జిల్లా కలెక్టర్, సిసి ఎల్ ఎ స్థాయిలలో అప్పిలు చేసుకోవచ్చని తెలిపారు. గ్రామాలలో చాలావరకు భూమి హద్దుల గొడవలు ఉంటాయని, కానీ భూభారతిలో రీ సర్వే, కొనుగోలు, పాలు పంపకాలు, దాన దస్తావేజులు, విరాసట్ పట్టా మార్పిడికి తప్పనిసరిగా కమతం జతపరచడం వల్ల భవిష్యత్తులో భూ గొడవలు ఉండవని తెలిపారు. జూన్ 2వ తేదీ తర్వాత ప్రతి గ్రామంలో భూ సమస్యలపై రెవెన్యూ సదస్సు నిర్వహించడం ద్వారా పరిష్కారం లభిస్తుందని తెలిపారు.
భూభారతి చట్టంలో బాధితులకు న్యాయ సలహా వ్యవస్థ ఉందని, గతంలో గ్రామాలలో గ్రామ పరిపాలన, విఆర్ఓ/వి.ఆర్.ఏ వ్యవస్థ ఉండేవని, వారిని ఇతర శాఖలలో సర్దుబాటు చేయడం వల్ల గ్రామాలలో భూ సమస్యలు పెరిగాయని, త్వరలో గ్రామ పాలన అధికారి, లైసెన్సుడ్ సర్వేయర్ల నియామకంతో భూ సమస్యలను తగ్గించవచ్చని తెలిపారు. విరాసత్ మార్పిడికి వారసులకు అందరికీ నోటీసులు జారీ చేసే ప్రక్రియ ఉందని, చిత్త ద్వారా భవిష్యత్తులో ఎలాంటి గొడవలు ఉండవని తెలిపారు. ప్రతి రైతు భూభారతి చట్టంలోని అంశాల పట్ల అవగాహన చేసుకోవాలని తెలిపారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ధరణి చట్టం ద్వారా చాలామంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ధరణిలో ఎలాంటి సమస్యలు పరిష్కారం కాలేదని తెలిపారు.
భూమి విషయాలలో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగేవని, ఇప్పుడు అలాంటి సమస్య ఉండదని, ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందని తెలిపారు. చట్టం ద్వారా రెవెన్యూ, అటవీ భూముల పరిష్కారం లభిస్తుందని, సాదా బైనమాల ప్రకారం కొనుగోలు చేసిన భూములకు పరిష్కారం లభిస్తుందని, పార్ట్ బి లో వేల ఎకరాల భూములకు పరిష్కారం లభించి వారికి పాస్ పుస్తకాలు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. భూభారతిలో రైతు తన సమస్యలను పరిష్కరించేందుకు ఎన్నో అవకాశాలు ప్రవేశపెట్టడం జరిగిందని, చట్టంలోని అంశాలు, హక్కులపై ప్రతి రైతు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.
ఆర్డిఓ మాట్లాడుతూ... భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టంలో పొందుపరిచిన అంశాలు రైతులకు ఎంతో మేలు చేస్తుందని, ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. 1/70 చట్టంకు లోబడి భూభారతి చట్టం రూపొందించడం జరిగిందని తెలిపారు. పట్టా మార్పిడి జరిగే ప్రతి కమతంకు మండల సర్వేయర్ల నక్ష జతపరచడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు తావు ఉండదని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, తహసిల్దార్ సూర్య ప్రకాష్, సహకార సంఘం అధ్యక్షులు చుంచు శ్రీనివాస్, వివిధ గ్రామాల రైతులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.