calender_icon.png 24 October, 2024 | 2:55 PM

హైడ్రాను అడ్డుకోండి

24-10-2024 03:01:09 AM

  1. హైకోర్టులో కేఏ పాల్ వాదన
  2. చట్ట ప్రకారమే చేస్తున్నామన్న సర్కార్
  3. కూల్చివేతలపై స్టేకు నిరాకరణ
  4. విచారణ 3 వారాలకు వాయిదా

హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): హైడ్రా ఏర్పాటు చేయడమే తరువాయి ప్రభుత్వం ముందూ వెనుకా చూడకుండా ఏకపక్షంగా కూల్చివేత చర్యలు తీసుకుంటోందని, ఆ చర్యలు పేదల విషయంలో నిర్ధాక్షణ్యంగా ఉన్నాయని, ధనిక పెద్దల విషయంలో నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుందంటూ ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ హైకోర్టులో వాదనలు వినిపించారు.

హైడ్రా జనాన్ని హడలెత్తిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎప్పుడు ఎవరి ఇళ్లను కూల్చేస్తుందో తెలియని భయాందోళనల పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. హైడ్రా, మూసీ నది ప్రక్షాళన చర్యల పేరుతో ఇళ్ల కూల్చివేతలను సవాల్ చేస్తూ కేఏ పాల్ వ్యక్తిగత హోదాలో దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంలో కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, హైడ్రాను కోర్టు ఆదేశించింది.

నోటీసులు జారీ తర్వాతే అక్రమ కట్టడాల కూల్చివేత చర్యలు తీసుకుంటున్నామని, ఏకపక్షంగా వ్యవహరించడం లేదని ప్రభుత్వం చేసిన వాదనలను పరిగణనలోకి తీసుకుని ఏ విధమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం లేదని స్పష్టం చేసింది.

కౌంటర్లు దాఖలు చేసేందుకు హైడ్రా, రాష్ట్ర ప్రభుత్వాలకు మూడు వారాల సమయం ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాస్‌రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

నోటీసు ఇచ్చాకే కూల్చివేతలు ఉండాలి

ముందుగా బాధితులకు నోటీసులు జారీ చేయాలని, ఇళ్లు ఖాళీ చేయడానికి లేదా నోటీసులపై కోర్టులో సవాల్ చేసేందుకు కనీసం నెల రోజుల గడువు ఇవ్వాలని, పేదలను గుర్తించి సమగ్ర పునరావాసం కల్పించేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని పాల్ దాఖలు చేసిన పిల్‌లో పేర్కొన్నారు.

పాల్ వ్యక్తిగత హోదాలో దాఖలు చేసిన పిల్ తరఫున స్వయంగా వాదనలు వినిపిస్తూ, ఏవిధమైన నోటీసులు జారీ చేయకుండానే పేదల ఇళ్లు 460 వరకు నిర్మాణాలను కూల్చేశారని, అదే ధనవంతులకు చెందిన 250 కట్టడాలకు వ్యతిరేకంగా అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ కూల్చివేత చర్యలు లేనేలేవని చెప్పారు.

హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ మినహా పెద్ద వాళ్ల నిర్మాణాల కూల్చివేతలు వేళ్లమీద లెక్కించొచ్చునని చెప్పారు. అక్రమ కట్టడాల కూల్చివేతలకు ఎవరూ వ్యతరిరేకం కాదని.. అయితే, ఆ చర్యలు చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉండాలన్నదే తమ అభిమతమని చెప్పారు.

అదే పేద, మధ్య తరగతివారికి చెందిన 460 వరకు నిర్మాణాలను కనీసం నోటీసు కూడా ఇవ్వకుండానే కూల్చేశారని ఆక్షేపించారు. ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వాలని, కనీసం రెండు వారాల గడువు ఇవ్వకుండా రాత్రికి రాత్రి కూల్చేయడం ఏమిటో అర్ధం కావడం లేదన్నారు.

కూల్చివేతలతో రాష్ట్రం మరో ఉత్తరప్రదేశ్‌లా మారుతోందని ఆరోపించారు. ప్రభుత్వం ఏకపక్షంగా, వివక్షతో చర్యలు తీసుకుంటోందని ధ్వజమెత్తారు. కొందరికి మాత్రం సమయం ఇవ్వడం, నోటీసులు ఇచ్చినా చర్యలు తీసుకోకపోవడం, మరికొందరికి నోటీసులు ఇవ్వకుండానే కూల్చేయడం, నోటీసులు ఇచ్చిన 48 గంటలకే కూల్చేయడం దారుణమని వాదించారు.

పేద, దిగువ తరగతి కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా ఉంటున్న ఇళ్లను కూల్చేశారని, వాళ్లు తమకు అన్యాయం జరిగిందని చెప్పి కోర్టుల్లో కేసులు వేసే ఆర్థిక స్తోమత కూడా లేదని చెప్పారు. ఇలాంటి బాధితులకు పరిహారం ఇచ్చేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.

జరిగిన నష్టాన్ని బట్టి పరిహారం, ఇళ్ల కేటాయింపులు ఉండాలన్నారు. తక్షణమే కూల్చివేతలను అడ్డుకోవాలని కోరారు. నోటీసులు జారీ చేశాక బాధితుల వాదనలు విన్నాక, వాళ్ల వద్ద ఉన్న ఆధారాలు పరిశీలించాకే కూల్చివేతలపై హైడ్రా, ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి ఆదేశాలను జారీ చేయాలని కోరారు. 

పరిహారం ఇచ్చాకే కూల్చేస్తున్నారా?: హైకోర్టు

వాదనలపై స్పందించిన హైకోర్టు.. నోటీసులు జారీ చేయకుండా కూల్చివేతలకు పాల్పడుతున్నారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మూసీ బాధితులకు పరిహారం ఇచ్చాకే కూల్చేస్తున్నారా? అని కూడా ఆరా తీసింది. ప్రభుత్వ న్యాయవాది స్పందించకపోతే కోర్టులపై భారం పడుతుందని వ్యాఖ్యానించింది. అదనపు అడ్వొకేట్ జనరల్ ఎక్కడున్నారని ఆరా తీసింది. పిటిషనర్ల అభియోగాలకు ప్రభుత్వం తమ వాదనల ద్వారా వివరణ ఇవ్వకపోతే ఎలా అని అసహనం వ్యక్తంచేసింది.  

చట్ట ప్రకారమే చర్యలు: ఏఏజీ

అడిషనల్ అడ్వొకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ, మూసీలో మార్కింగ్ చేసిన ఇళ్లకు పరిహారం ఇచ్చాకే కూల్చివేత చర్యలు చేపడుతున్నారని చెప్పారు. పరిహారంపై బాధితులు సమ్మతిని వ్యక్తం చేశాకే అక్రమ ఇళ్ల కూల్చివేత చేపడుతున్నామని తెలిపారు. ఈ హామీని హైకోర్టు రికార్డుల్లో నమోదు చేసింది.

ముందుగా నోటీసులు జారీ చేయాలని, చట్ట నిబంధనలను అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. ప్రభుత్వ హామీ నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని తెలిపింది.హైడ్రా తరఫు న్యాయవాది స్పందిస్తూ.. చెరువులు, కుంటలు కాపాడాలనే కీలక నిర్ణయం ప్రభుత్వం తీసుకుందని, ఆ క్రమంలోనే హైడ్రా ఏర్పాటైందని చెప్పారు.

ఇప్పటి వరకు జలాశయాల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లల్లోని ఇళ్లకు హైడ్రా అధికారులు మార్కింగ్ మాత్రమే చేశారని, ఏ విధమైన కూల్చివేతలు ప్రారంభించలేదని చెప్పారు. హైడ్రా ఏర్పాటు జీవో 99 తర్వాత దానికి చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిందని వెల్లడించారు.

పిటిషనర్ కోరినట్లుగా ఏవిధమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రభుత్వ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. మధ్యంతర ఉత్తర్వుల జారీకి నిరాకరించింది. ప్రభుత్వం, హైడ్రా కౌంటర్లు దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జరిగే మూడు వారాల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.