calender_icon.png 27 September, 2024 | 3:06 AM

బీసీ ఉద్యమం బలోపేతానికే రాజీనామా

26-09-2024 12:42:02 AM

బీసీలకు 50% రిజర్వేషన్ల సాధనే నా జీవిత లక్ష్యం 

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య 

బీసీలకు న్యాయం జరగాలి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న 

ఆర్ కృష్ణయ్యతో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి భేటీ 

హైదరాబాద్, సెప్టెంబర్‌౨౫ (విజయక్రాంతి)/ముషీరాబాద్: బీసీ ఉద్యమం బలోపేతా నికే తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనా మా చేసినట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీ య అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య స్పష్టంచేశారు. రాజకీయాలకు అతీతంగా ఉద్యమం చేయబోతున్నట్టు వెల్లడించారు. 

బుధవారం హైదరాబాద్ విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు న్యాయం చేయడం లేదని, వివిధ పద్ధతుల్లో ఉద్యమం చేస్తామని తెలిపారు. బీసీల తరపున చట్ట సభల్లో ప్రశ్నించినా సమాధానం రాలేదని ఆవేదన వ్యక్తంచేశా రు. నాలుగేండ్ల పదవీ కాలం ఉన్నా బీసీల తరపున ఆలోచించే.. తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పారు.

ప్రజాఉద్యమం, బీసీ ఉద్యమమే తన ప్రత్యేక కార్యాచరణ అని ప్రకటించారు. రాజ్యాధికారంలో వాటాతో పాటు చట్టసభల్లో 50 శాతం సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 21 సీట్లు ఇచ్చారని, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచాలని కోరారు. బీసీల కోసం చాలా త్యాగాలు చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు.

గ్రామ, మండల, జిల్లా కమిటీలు వేయాలని కోరుతున్నామని చెప్పారు. అన్ని పార్టీల వారు ఈ ఉద్యమంలోకి రావాలని కోరారు. చట్ట సభ ల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు సాధించడమే తన జీవిత లక్ష్యమని ఉద్ఘాటించారు. దీని కోసం ప్రతి బీసీ బిడ్డా పోరాడాలని పిలుపునిచ్చారు.  

కృష్ణయ్యతో మల్లు రవి, వీహెచ్, తీన్మార్ మల్లన్న భేటీ

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్యతో కాంగ్రె స్ పార్టీ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు వేర్వేరుగా భేటీ అయ్యారు. ఆర్ కృష్ణయ్య రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఆయన తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొన్నది. తాజా రాజకీయ పరిస్థితులపై వారి మధ్య చర్చ జరిగింది.

కాంగ్రెస్ పార్టీ కుల గణన చేయడంతో పాటు బీసీ రిజర్వేషన్లను పెంచాలనే ఆలోచనతో ఉండటం తో.. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లు సమాచారం. కుల గణనకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కూడా అనుకూలం గా ఉన్నారని కాంగ్రెస్ నేతలు ఆర్ కృష్ణయ్య కు వివరించారు. కుల గణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని వివరించారు. 

ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. బీసీ ప్రధాని అని చెప్పుకొనే నరేంద్రమోదీ బీసీలకు చేసిందేమి లేదన్నారు. కుల గణనకు బీజేపీ వ్యతిరేకంగా ఉందని, రాహుల్ గాంధీ మాత్రం కులగణన చేస్తామని చెప్తున్నారని గుర్తు చేశారు. ఆర్ కృష్ణయ్య తీసుకో బోయే నిర్ణయం ఏదైనా మెజార్టీ బీసీలకు ఆమోద యోగ్యంగా ఉంటుందని చెప్పారు.

బీసీల డిమాండ్లు నేరవేర్చుకునే పరిస్థితులు, అవకాశాలు కాంగ్రెస్ పార్టీలోనే కనిపిస్తున్నాయని, అందుకే ఆర్ కృష్ణయ్యను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. గత ౫౦ ఏండ్లలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. బీసీలకు న్యాయం జరిగాలని, అందుకు తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు.