- సిద్దిపేట జిల్లాలో పలు రిజర్వాయర్లలోకి గోదావరి జలాలు
- రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లకు ప్రారంభమైన నీటి విడుదల
- ఈ నెల 19 వరకు జలాశయాల్లోకి కొనసాగనున్న పంపింగ్
- రైతులకు సాగు నీరందించడానికి ప్రభుత్వ నిర్ణయం
గజ్వేల్, ఆగస్టు 8: సిద్దిపేట జిల్లాలోని రిజర్వాయర్లు జలకళను సంతరించుకుంటున్నాయి. అట్టడుగుకు చేరిన నీటిమట్టంతో కళతప్పిన రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్‌లోకి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. అనంతగిరి రిజర్వాయర్ ద్వారా ఈ నెల 6వ తేదీ నుంచి రంగనాయక సాగర్‌లోకి ఇరిగేషన్ అధికారులు నీటిని విడుదల చేస్తుండగా, గురు వారం ఉదయం నుంచి మల్లన్నసాగర్, కొం డపోచమ్మ సాగర్ జలాశయాలకు నీటిని విడుదల ప్రారంభించారు. అనంతగిరి రిజర్వాయర్ నుంచి రోజుకు 0.5 టీఎంసీల చొప్పున రంగనాయకసాగర్‌లోకి విడుదల చేస్తున్నారు.
6వ తేదీకి ముందు రంగనాయకసాగర్‌లో 0.68 టీఎంసీల నీటిమట్టం ఉండగా, ప్రస్తుత నీటి మట్టం 1.89 టీఎంసీలకు చేరింది. రంగనాయక సాగర్ నుంచి మల్లన్నసాగర్‌లోకి గురువారం నీటి విడుదలను అధికారులు ప్రారంభించారు. ప్రస్తుతం మల్లన్నసాగర్‌లో నీటిమట్టం 8.6 టీఎంసీలు ఉండగా, ప్రతిరోజు 5200 క్యూసెక్కుల (0.4 టీఎంసీ) చొప్పున నీటిని పంప్‌హౌస్ నుంచి విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అక్కడి నుంచి అక్కారం పంప్‌హౌస్, మర్కూక్ పంపుహౌస్‌ల ద్వారా కొండపోచమ్మ సాగర్‌లోకి రోజుకు 1250 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు.
కొండపోచమ్మ సాగర్‌లో ప్రస్తుతం 4 టీఎంసీల నీటి నిల్వలు ఉండగా, మరో 6 టీఎంసీలకు వరకు నీరు నింపే అవకాశం ఉంది. ప్రభుత్వం తొలుత రిజర్వాయర్లలోకి ఈ నెల 11 వరకు నీటిని విడుదల చేయాలని ఆదేశించగా, దీనిని 19వ తేదీ వరకు కొనసాగించాలని గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నీటిని వర్షాకాలం పంటల సాగుతో పాటు యాసంగి పంటలకు కూడా వినియోగించనున్నారు.