calender_icon.png 20 October, 2024 | 6:56 AM

చివరి దశలో రిజర్వాయర్ల పనులు

20-10-2024 02:21:53 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 19(విజయక్రాంతి): వృథాగా పోతున్న నీటిని గుర్తించి దాన్ని అరికట్టడం ద్వారా ఖర్చు తగ్గించుకోవచ్చని   జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి అన్నారు. పటాన్‌చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీకి తాగునీటిని అందించేందుకు.. ఓఆర్‌ఆర్ ప్రాజెక్టు  ప్యాకేజీ  చేపట్టిన  రిజర్వాయర్లను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉస్మాన్‌నగర్ రిజర్వాయర్ల సర్వీస్ ఏరియాకు సం బంధించిన వాటర్ ఆడిట్‌ను ప్రారంభించాలని అధికారులకు సూచించారు.

రిజర్వాయ ర్ల నుంచి సరఫరా చేస్తున్న నీటిని లెక్క కట్టేలా ఫ్లో మీటర్‌ను పెట్టి చివరి వినియోగదారుని వద్దకు మీటర్ రీడింగ్ సరిపోయేలా లెక్కకడితే ట్రాన్స్ మిషన్ లాస్ తెలుస్తుందన్నారు. ఉస్మాన్‌నగర్‌లో చేపట్టిన జంట రిజర్వాయర్ల నిర్మాణం పనులు చివరి దశకు చేరాయని తెలిపారు. ఇప్పటికే 2ఎంఎల్ రిజర్వాయర్ ఇన్‌లెట్, అవుట్ లెట్ నిర్మాణం పూర్తికావడంతో ట్రయల్న్ నిర్వహించామని తెలిపారు. మిగిలిన ఎలక్ట్రికల్ పనులు, క్లోరిన్ రూమ్, 4 ఎంఎల్ రిజర్వాయర్‌కు సంబంధించిన పెండింగ్ పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. రూ.30కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ రిజర్వాయర్ల నిర్మాణం పూర్తయితే దాదాపు లక్షమందికి శుద్ధిచేసిన తాగునీరు అందుతుందన్నారు. 120 బల్క్ కనెక్షన్లు రానున్న ట్లు, అందుకోసం ఇప్పటికే 22 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూషన్ లైన్లను నిర్మించినట్లు అశోక్‌రెడ్డి పేర్కొన్నారు. 

తెల్లాపూర్ ఎస్టీపీ

నిర్మాణానికి స్థల పరిశీలన..

అమృత్ పథకంలో భాగంగా 31 ఎంఎల్‌డీల సామర్థ్యంతో తెల్లాపూర్‌లో చేపట్టబోయే ఎస్టీపీ నిర్మాణానికి అధికారులతో కలిసి అశోక్‌రెడ్డి స్థల పరిశీలన చేశారు. తెల్లాపూర్‌లోని మేళ్ల చెరువు, వనం చెరువు పరీవాహక ప్రాంతాల్లో పర్యటించారు. ఎస్టీపీ నిర్మాణం వల్ల జరిగే లాభాన్ని స్థానికులకు వివరించారు.