calender_icon.png 15 November, 2024 | 9:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యేల అనర్హతపై తీర్పు రిజర్వ్

13-11-2024 02:06:17 AM

ఫిరాయింపులపై హైకోర్టులో వాదనలు పూర్తి

హైదరాబాద్ నవంబర్ 12 (విజయక్రాంతి): పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై షెడ్యూలు ఖరారు చేయాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసి న రెండు అప్పీళ్లపై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడంతో వారిపై అనర్హత వేటు వేయాలంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద పిటిషన్లు దాఖలు చేశారు. వీటితోపాటు దానంపై  అనర్హత వేటు వేయాలం టూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మరో పిటిషన్ సమర్పించారు.

 అనర్హత పిటిషన్లను స్పీకర్ స్వీకరించకపోవడంతో వీరు హైకోర్టును ఆశ్రయించారు. వీటిపై విచారించిన సింగిల్ జడ్జి.. 4 వారాల్లో అనర్హత పిటి షన్లపై షెడ్యూలు ఖరారు చేయాలని సెప్టెంబరు 9న తీర్పు వెలువరించారు. అలా షెడ్యూల్ నిర్ణయించని పక్షంలో హైకోర్టు జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వీ నరసింహాచార్యులు దాఖలు చేసిన రెండు వేర్వేరు అప్పీళ్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణను పూర్తిచేసింది. 

అడ్వొకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. స్పీకర్ రాజ్యాంగ విధుల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదని అన్నారు. స్పీకర్ నిర్ణయం వెలువరించేదాకా నిర్దిష్ట గడువు విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చే అధికారం కోర్టులకు లేదని చెప్పారు. స్పీకర్ నిర్ణయం వెలువరించిన తరువాతే న్యాయసమీక్షకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. స్పీకర్ విధులపై న్యాయసమీక్ష పరిమితమని తెలిపారు.

అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పు అంతిమమని అన్నారు. అంతేగానీ ముగ్గురు జడ్జీల తీర్పును పరిగణనలోకి తీసుకుని ఉత్తర్వులు జారీచేయరాదని తెలిపారు. పార్టీ ఫిరాయింపులపై గతంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు పిటిషన్ దాఖలు చేసినా.. స్పీకర్ విధుల్లో జోక్యం చేసుకోలేమని ఇదే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తుచేశారు.

స్పీకర్‌కు పిటిషన్లు పంపిన 10 రోజుల్లోనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించారని తెలిపా రు. నిర్ణయం తీసుకోవడానికి కనీస గడువు కూడా ఇవ్వలేదని చెప్పారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే న్యాయసమీక్ష చేయరాదంటూ కిహోటో హోలోహాన్ కేసులో సుప్రీం కోర్టు స్పష్టం చేసిందన్నారు. ప్రస్తుత కేసుకు కేశం మెగాచంద్రసింగ్ కేసులోని తీర్పు వర్తించదన్నారు. అందువల్ల పరిధి దాటి ఇచ్చిన సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయాలని కోరారు. 

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఒక్కరోజు కూడా చట్టసభలో కొనసాగడానికి వీల్లేదని బీఆర్‌ఎస్ తరపు న్యాయవాదులు గతంలో వాదించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందేనని కోరారు. అన్ని పక్షాల వాదనల అనంతరం హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.