calender_icon.png 22 February, 2025 | 2:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్‌లు కల్పించాలి..

21-02-2025 11:07:40 PM

12, 13 తేదీల్లో ఛలో ఢిల్లీ వాల్‌పోస్టర్ విడుదల..

సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య..

ముషీరాబాద్ (విజయక్రాంతి): చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్‌లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. మార్చి 12, 13 తేదీలలో నిర్వహించ తలపెట్టిన ఛలో డిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం, దక్షిణాది రాష్ట్రాల ఓబీసీల సంఘం ఆధ్వర్యంలో జరిగిన కుల సంఘాల సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్. మారేష్, దక్షిణాది రాష్ట్రాల ఓబీసీ సంఘం జబ్బల శ్రీనివాస్, గ్రేటర్ హైదరాబాద్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు భూపేష్ సాగర్‌లతో కలిసి ఛలో డిల్లీ వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.

అనంతరం ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ... స్వాతంత్య్ర సిద్దించి 76 ఏండ్లు గడుస్తున్నా ఓబీసీలకు రాజకీయ స్వతంత్రం రాలేదన్నారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు సాధించడం ద్వారా మాత్రమే బీసీలకు రాజ్యాధికారం దక్కుతుందన్నారు. దేశ వ్యాప్తంగా కులగణన జరగవలసిన చారిత్రాత్మక ఆవశ్యకత ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఓబీసీల సమస్యలపై స్పందించాలని అన్నారు. ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఎన్. మారేష్ మాట్లాడుతూ... ఓబీసీ డిమాండ్ల సాధన కోసం మార్చి 12, 13 తేదీల్లో ఛలో డిల్లా ఏపీ భవన్‌లోని అంబేద్కర్ ఆడిటోరియంలో ఓబీసీ డిమాండ్లపై మేధావులు సదస్సును నిర్వహిస్తున్నాట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు సి. రాజేందర్, అనంతయ్య, పీతాను ప్రసాద్, నడిపిన శ్రీనివాసరావు, నీలం వెంకటేశ్, రాజశేఖర్, వరుణ్, లక్ష్మణ్ రావులతో పాటు 40కి పైగా కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.