16-03-2025 08:37:43 PM
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య..
ముషీరాబాద్ (విజయక్రాంతి): ఓబీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు, ఆర్. కృష్ణయ్య అన్నారు. ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (ఏఐ ఓబిసి) ఫెడరేషన్ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ సమావేశం ఆదివారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దానకర్ణ చారి అధ్యక్షతన జరిగింది. సందర్భంగా ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ... బీసీ ఉద్యోగులే బిసి ఉద్యమానికి నాయకత్వం వహించినప్పుడే ఉద్యమం పతక స్థాయికి చేరుకుంటుందని తెలిపారు.
బీసీలకు విద్యా ఉద్యోగాలలో జనాభా ప్రకారం 52 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని అన్నారు. ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి జి.కరుణానిధి మాట్లాడుతూ... రాజ్యాంగ విరుద్ధమైన ఓబీసీ లపై విధించిన క్రీమీ లేయర్‌ను రద్దు చేయాలని అన్నారు. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగించి, అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలలో ఓబీసీలకు దామాషా రిజర్వేషన్‌ను అమలు చేయాలన్నారు. అగ్ర కులాల్లో ఈడబ్ల్యూఎస్ 10 శాతం రిజర్వేషన్ రద్దు చేయాలని అన్నారు. ఓబిసి సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వశాఖ కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షులు దానకర్ణ చారి మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ వి. హనుమంతరావు, ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండు, వర్కింగ్ ప్రెసిడెంట్ రవి కుమార్ ముదిరాజ్, నాయకులు రామ్ రాజ్, వంశీకృష్ణ, రామ్మూర్తి, రమేష్, పోలీసులు పాల్గొన్నారు.