calender_icon.png 27 February, 2025 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ వర్గీకరణలో శాస్త్రీయంగా రిజర్వేషన్లను కేటాయించాలి

26-02-2025 10:56:32 PM

మార్చి 1న ఓయూలో మాదిగ అమరవీరుల సభ..

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్‌ మాదిగ..

హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ సమర్పించిన నివేదిక లోపభూయిష్టంగా ఉందని, ఎస్సీ వర్గీకరణలో రిజర్వేషన్ల కేటాయింపు శాస్త్రీయంగా చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్‌ మాదిగ అన్నారు. బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ గెస్ట్‌హౌజ్‌లో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్(ఎంఎస్‌ఎఫ్) ఓయూ అధ్యక్షుడు మంద రాజు మాదిగ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎస్సీ ఉపకులాలను వివిధ గ్రూపులలో చేర్చే క్రమంలో ప్రమాణిక సూత్రాలను పాటించలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన వర్గీకరణపై ఏ కులం సంతృప్తిగా లేదని, సీఎం రేవంత్‌రెడ్డి ఈ విషయాన్ని గుర్తించాలని చెప్పారు.

మాదిగలకు 9శాతం రిజర్వేషన్లు కేటాయించడం అన్యాయమని, జనాభా ప్రాతిపధికన చూస్తే తమకు 12శాతం, కమిషన్ నియమనిబంధనలు పాటించినా 11శాతం రిజర్వేషన్లు వస్తాయని చెప్పారు. అన్ని కులాలకు న్యాయం జరిగేలా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని భవిష్యత్ ఉద్యమాలు చేస్తామన్నారు. అందులో భాగంగా ఎస్సీ వర్గీకరణ కోసం ప్రాణాలర్పించిన మాదిగ అమరవీరుల సంస్మరణ సభను మార్చి 1న ఓయూ ఆర్ట్స్ కళాశాలలో నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణమాదిగ ముఖ్యఅతిథిగా పాల్గొంటారన్నారు. సమావేశంలో ఎంఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షులు చిప్పలపల్లి సోమశేఖర్, అధికార ప్రతినిధి బొర్ర బిక్షపతిమాదిగ, తెలంగాణ అధికార ప్రతనిధి కొమ్ము శేఖర్‌మాదిగ, జాతీయ కార్యదర్శి డా.పల్లెర్ల సుధాకర్, ఉపాధ్యక్షులు తోకల చిరంజీవి, ఎమ్మార్పీఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.