calender_icon.png 12 December, 2024 | 5:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లే ధ్యేయం

12-12-2024 01:44:32 AM

చంద్రబాబు బీసీని సీఎం చేస్తానన్నందుకే పాలిటిక్స్‌లోకి వచ్చా

  1. రాష్ట్రంలో పదేళ్లపాటు కేసీఆర్ నిరంకుశ పాలన
  2. సీఎం రేవంత్‌రెడ్డికి విజన్ ఉన్నా డబ్బులు లేవు
  3. రాష్ట్రంలో పదేళ్లపాటు కేసీఆర్ నిరంకుశ పాలన
  4. సాధ్యం కాని హామీల వల్ల రాష్ట్రం నాశనం అవుతుంది
  5. ‘విజయక్రాంతి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య

సమగ్ర కులగణన సర్వేపై మాకు పూర్తి నమ్మకం ఉంది. బీసీ ఉద్యమకారుల పోరాట ఫలితంగానే రాష్ట్రంలో సమగ్ర కులగణన జరుగుతున్నది. సర్వేతో బీసీల లెక్కలు తేలుతాయి. ఫలితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ప్రాతినిధ్యం పెరు గుతుంది. విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్లు పెరుగుతాయి. ఏ, బీ, సీ, డీ వర్గీకరణ ప్రకారం న్యాయం జరుగుతుంది.

కార్పొరేషన్లకూ బడ్జెట్  కేటాయింపులు సక్ర మంగా జరుగుతాయి..  దేశంలో 3 శాతం జనాభా ఉన్న ఓసీలకు 10 శాతం రిజర్వేషన్లు, 56 శాతం ఉన్న బీసీలకు కేవలం 27 శాతం రిజర్వేషన్లు అమలుచేయడం న్యాయం కాదు. ఇది రిజర్వేషన్ల స్ఫూర్తికే వ్యతిరేకం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై మా పోరాటం కొనసాగుతుంది. 

హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): చట్టసభల్లో దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు సాధించడమే తన ధ్యేయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు.

త్వరలో ఆయన ఏపీ నుంచి బీజేపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ‘విజయక్రాంతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖాముఖీలో తన భవిష్యత్తు కార్యాచరణ గురించి అనేక అంశాలు పంచుకున్నారు.

ఉద్యమ జీవితం ఎక్కడి నుంచి ప్రారంభమైంది?

1974లో వికారాబాద్‌లో నా ఉద్యమ జీవితం ప్రారంభమైంది. నేను ప్రత్యక్షంగా 11వేలకు పైగా సభలు, సమావేశాలు, ధర్నాలు, ఆందోళనలు చేపట్టాను. మిలిటెంట్ తరహా పోరాటాలు నిర్వహించాను. అసెంబ్లీ, సెక్రటేరియేట్ ముట్టడించి ప్రజాసమస్యలకు పరిష్కారం చూపాను. విద్యార్థు దశ నుంచే ఉద్యమాల్లో ఉన్నా.

హాస్టళ్లు, ఉపకార వేతనాలు, ఫీజురీయింబర్స్‌మెంట్, మెస్ ఛార్జీల పెంపు, కేంద్ర ఉద్యోగాల్లో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు.. ఇలా ఎన్నో పోరాటాల్లో భాగస్వామినయ్యా. విద్యార్థుల సంఖ్యకు తగిన విధంగా హాస్టళ్లు ఏర్పాటు చేయాలనే నినాదంతో తొలి ఉద్యమం చేపట్టా. మా ఉద్యమానికి నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్పందించారు.

గురుకులాల సమస్యకు పరిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ నన్ను రాజకీయాల్లోకి ఆహ్వానించారు. నేను సున్నితంగా తిరస్కరించా. 1986లో బీసీ రిజర్వేషన్లు 25 నుంచి 44 శాతం పెరిగాయి. దీంతో అగ్రకులాలకు చెందిన కొందరు ఆ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. కౌంటర్‌గా మేమూ ఉద్యమం చేశాం.

రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న సమగ్ర కుల గణన మీకు విశ్వాసం ఉందా?

సర్వేపై మాకు పూర్తి నమ్మకం ఉంది. బీసీ ఉద్యమకారుల పోరాట ఫలితంగానే రాష్ట్రంలో సమగ్ర కుల గణన జరుగుతున్నది. సర్వేతో బీసీల లెక్కలు తేలతాయి. ఫలితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ప్రాతినిధ్యం పెరుగుతుంది. విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్లు పెరుగుతాయి. ఏ, బీ, సీ, డీ వర్గీకరణ ప్రకారం న్యా యం జరుగుతుంది. కార్పొరేషన్లకూ బడ్జెట్  కేటాయింపులు సక్రమంగా జరుగుతాయి.  

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో బీసీలకు అన్యాయం జరుగుతుందా?

దేశంలో 3 శాతం జనాభా ఉన్న ఓసీలకు 10శాతం రిజర్వేషన్లు, 56 శాతం ఉన్న బీసీలకు కేవలం 27 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం న్యాయం కాదు. ఇది రిజర్వేషన్ల స్ఫూర్తికే వ్యతిరేకం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై మా పోరాటం కొనసాగుతుంది.

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కారణంగా విద్య, ఉద్యోగ అవకాశాల్లో కటాఫ్ మార్కులు తక్కువగా ఉన్నా ఓసీలకే అవకాశాలు వస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలు అన్యాయానికి గురవుతున్నారు. దీనిపై కేంద్రంతో చర్చిస్తాను. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం జరిగేలా చూస్తాను. 

బీసీ ఉద్యమ నేత రాజకీయాల్లోకి ఎలా వచ్చారు ?

గతంలో ఎంతో మంది సీఎంలు నాకు ఎమ్మెల్యే సీటు ఇస్తామన్నారు. అయినా నేను రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత బీసీని సీఎం చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆ యన మాట ప్రకారం నేను ఎల్బీనగర్ స్థా నం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాను.

తర్వాత మిర్యాలగూడలో కాంగ్రెస్ తరఫున పోటీ చేశాను. ఓటమి చూశాను. తర్వాత ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పిలిచి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. ఇప్పుడు కూడా  బీజేపీ పిలిచి మరీ ఎంపీగా అవకాశం కల్పిస్తోంది. నేను ఎక్కడ ఉన్నా పేదల పక్షమే. బీసీలకు చట్టసభల్లో దామాషా ప్రకారం రిజర్వేషన్లు సాధించడమే నా జీవితాశయం.

రాజ్యసభ సభ్యుడిగా మీ ప్రమాణ స్వీకారం ఎప్పుడు?

ఏపీలో మూడు రాజ్యసభ సీట్లకు ముగ్గురు మాత్రమే నామినేషన్లు వేశారు. ఇక మా ఎన్నిక లాంఛనమే. ఈ నెల 15 లేదా 16వ తేదీల్లో నేను రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. బీజేపీ తనకు ఎలాంటి బాధ్యత ఇచ్చినా క్రమశిక్షణతో నెరవేరుస్తాను. 

గత ప్రభుత్వం పాలనలో ఏం గమనించారు?

తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్ పాలనా పగ్గాలు చేపట్టింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదేళ్ల పాటు నిరంకుశ పాలన సాగించారు. బీసీలను అణచివేయాలని చూశారు. అయినప్పటికీ రాష్ట్రంలో బీసీ వాదం నిలబడింది. పదేళ్లుగా స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల కాలేదు. ప్రతి గ్రామం నుంచి ఇప్పుడు ఇంజినీరింగ్ చదివే విద్యార్థులు వస్తున్నారంటే అందుకు మేం చేసిన పోరాటాలే కారణం.

తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాలను చూస్తే మీకేమనిపిస్తోంది?

సీఎం రేవంత్ రెడ్డి యువనేత. ఏదో చేయాలనే తపన ఆయనలో నాకు కనిపిస్తోంది. కానీ, గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్లిపోయింది. కాబట్టి సీఎం రేవంత్‌రెడ్డి ఏం చేయలేని పరిస్థితి. మరోవైపు అలవిగాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ హామీలతో రాష్ట్రం అభివృద్ధికి దూరమవుతుంది. మున్ముందు రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలు రావాలి. జలవనరులు పెరగాలి. అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది.