03-04-2025 11:46:33 PM
అసెంబ్లీలో ఆమోదించిన బీసీ బిల్లులను గవర్నర్‌కు పంపాలి..
హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): బీసీల పట్ల ఏమాత్రం బాధ్యత ఉన్నా రాష్ట్రంలో 42శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని, లేదంటే సీఎం రేవంత్ రెడ్డి దిగిపోవాలని బీసీ జన సభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ అన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... అసెంబ్లీలో ఆమోదించిన బీసీ బిల్లులను గవర్నర్‌కు పంపాలని కోరారు. కులగణన బీసీల సమస్యలన్నింటికీ పరిష్కారమని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని, రాజ్యాంగ సవరణ, 9వ షెడ్యూల్ పేరుతో ఢిల్లీలో మోడీపై ధర్మ యుద్ధం ధర్నా చేయడం సీఎం రేవంత్ రెడ్డి ద్వంద వైఖరికి నిదర్శనమన్నారు.
42 శాతం రిజర్వేషన్లను రాష్ట్రంలో అమలు చేయకుండా అటకెక్కించేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి డ్రామాలు పగటివేషగాళ్లను తలదన్నేలా కనిపిస్తున్నాయని విమర్శించారు. . మొదట రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అమలు చేసుకుని కేంద్రంపై కొట్లాడుదామని సూచించారు. రేవంత్ రెడ్డి మాయమాటలు నమ్మి బీసీలు మోసపోవద్దని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగ రంగంలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే వరకు రాజీలేని పోరాటం చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఇలాంటి చారిత్రక సందర్భంలో పార్టీల కతీతంగా బీసీ వర్గాలని ఏకతాటిపైకి రావాలని రాజారామ్ యాదవ్ పిలుపునిచ్చారు.
నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ చైర్మన్ విజిఆర్ నారగోని మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రెండు జీవోలను అమలు చేసి, రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. బీసీలకు అన్యాయం చేస్తే రాబోయే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతామని బీసీ సంఘాల నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ జర్నలిస్టుల ఫారం నాయకులు మేకల కృష్ణ, జవహర్ నగర్ కార్పొరేటర్ మేకల లలిత యాదవ్, బీసీ సంఘాల నాయకులు ఓరుగంటి వెంకటేష్ గౌడ్, సాలూరి రామకృష్ణ, వాసుకే యాదవ్, జల్ల నరేందర్ నేత, విద్యార్థి నిరుద్యోగ సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు కొంపెల్లి రాజు, బేరి రామచంద్ర యాదవ్, ఆర్కె సాయన్న, వివిధ విసి కుల సంఘాల నాయకులు హాజరయ్యారు.