calender_icon.png 28 October, 2024 | 12:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనాభాను అనుసరించే రిజర్వేషన్లు

12-08-2024 12:19:27 AM

  1. అలాగే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేపట్టాలి 
  2. కేంద్ర సంస్థల్లోనూ వర్గీకరణ అమలు చేయాలి 
  3. ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ డిమాండ్ 

హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): తెలంగాణలో మాదిగలకు అన్యాయం జరుగుతోందని, జనాభా దామాషా ప్రకారం ఎస్సీ వర్గీకరణ జరగాలని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ సూచించారు. ఎస్సీ రిజర్వేషన్లతోపాటు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల్లో మాదిగలకు జనాభా నిష్పత్తి మేరకు న్యాయమైన వాటా దక్కాలనే డిమాండ్‌తో ఆదివారం హైదరాబాద్‌లోని జగ్జీవన్‌రాం భవన్‌లో దేవని సతీశ్ మాదిగ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది.

ఈ సదస్సుకు ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, మాజీమంత్రి ఏ చంద్రశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలంగాణలో మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించే దిశగా ప్రభుత్వాన్ని ఒప్పించాలని కాంగ్రెస్ పార్టీలోని మాదిగలు, వివిధ సంఘాల నాయకులు సంపత్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంపత్‌కుమార్ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత మాదిగలకు న్యాయం జరిగే అవకాశం ఈ రోజు దక్కిందని, ఇప్పటి కోసం కాకుండా భవిష్యత్ తరాలకూ న్యాయం చేకూరేలా చట్టం తీసుకురావాలని ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, బీజేపీకి మాదిగలపైన ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలల్లో కూడా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. జాతి బాగు కోసం ఎంతవరకైనా పోరాడటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మంగళవారం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో సమావేశమై ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై చర్చించనున్నట్లు తెలిపారు. మాదిగలకు న్యాయం జరిగేందుకు మేధావులు, న్యాయవాదులు, నాయకులందరూ ముందుకురావాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీతోనే మాదిగలకు న్యాయం జరుగుతుందని, సీఎం రేవంత్‌రెడ్డి ముందుకువచ్చారని చంద్రశేఖర్ అన్నారు. అంబేడ్కర్ కల్పించిన రిజర్వేషన్లను జనాభా నిష్పత్తి మేరకు అందితేనే ఎస్సీల్లోని అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, పీసీసీ ప్రధాన కార్యదర్శి చారుకొండ వెంకటేశ్, గజ్జల కాంతం, మేరి మాదిగ తదితరులు పాల్గొన్నారు.