- నేడు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముట్టడి
- పిలుపునిచ్చిన బీసీ సంఘాలు
- స్థానిక ఎన్నికల్లో తీవ్ర అన్యాయం
- బీసీ డిక్లరేషన్‌లో రిజర్వేషన్ పెంపునకు కాంగ్రెస్ హామీ
- రాష్ట్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటుందా?
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయ క్రాం తి): స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కలెక్టరేట్ల ముట్టడికి బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కసరత్తు ముమ్మరంగా జరుగుతుండటంతో బీసీ వర్గాల్లో ఆందోళన మొదలైంది. బీసీ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేశాకనే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలోనే హామీ ఇచ్చింది.
దీంతో బీసీ రిజర్వేషన్ పెంపు డిమాండ్ ఊపందుకుంది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడుతున్న బీసీల పరిస్థితి రాజకీయంగానూ మారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజకీయ ఎదుగుదలకు దోహదపడేందుకు న్యాయం గా తమకు రావాల్సిన, ప్రభుత్వాలు హామీ ఇచ్చిన బీసీ రిజర్వేషన్ పెంపుపై పట్టు విడువడం లేదు. త్వరలో జరగబోయే పంచా యతీ ఎన్నికల్లోనే బీసీ రిజర్వేషన్ పెంపు లక్ష్యాన్ని సాధించుకోవాలని దృఢ సంకల్పంతో కార్యాచరణను రూపొందించుకుం టున్నాయి.
పంచాయతీరాజ్ చట్టం ప్రకారం..
పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో కేటాయించిన మొత్తం రిజర్వేషన్లు 60.5 శాతం. అందులో బీసీలకు రిజర్వేషన్ 34 శాతం కాగా, ఎస్సీల కు 18.3 శాతం, ఎస్టీలకు 8.25 శాతం కేటాయింపు జరిగింది. అయితే ఇవి ఉమ్మడి ఆం ధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్ధారించిన రిజర్వేషన్లే. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణలో 60 శాతం రిజర్వేషన్ ప్రక్రియ అమలులో ఉంది. వాస్తవానికి 34 శాతం రిజర్వేషన్ అమలు చేసినా తమకు అన్యాయమే జరుగుతుందని బీసీలు అభిప్రాయపడుతున్నారు. కానీ స్థానిక సంస్థల్లో తమకు కేటాయించిన 34 శాతం రిజర్వేషన్ కూడా తమకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
‘స్థానిక’ ఎన్నికల్లో తీవ్ర అన్యాయం..
స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బీసీలు ఆవేదన చెందుతున్నారు. గత ఎన్నికల్లో వారికి లభించిన రిజర్వేషన్ల శాతానికి సంబంధించిన గణాంకాలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. వాస్తవానికి బీసీలకు స్థానిక సంస్థ ల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్ రావాల్సి ఉంది. కానీ కిందటిసారి గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని 19,384 వార్డ్ మెంబర్లు, 2,458 సర్పంచులు, 151 ఎంపీటీసీల స్థానాల్లో వంద శాతం ఎస్టీలకు కేటాయించినవి కావడం గమనార్హం.
ఇక నాన్ షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని 93,970 వార్డు స్థానాల్లో 23.59 శాతం, 10,293 సర్పంచ్ స్థానాల్లో 22.78 శాతం, 5,692 ఎంపీటీసీ స్థానాల్లో 17.87 శాతం, 539 జెడ్పీటీసీ స్థానాల్లో 16.88 శాతానికి మాత్రమే బీసీలకు రిజర్వేషన్ లభించింది. ఇదిలా ఉండగా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ప్రాతినిథ్యా న్ని పరిశీలిస్తే.. 2,849 మున్సిపల్ వార్డుల్లో 29.55 శాతం, 511 మున్సిపల్ కార్పొరేషన్ వార్డుల్లో 33.46 శాతం, 150 జీహెచ్‌ఎంసీ వార్డుల్లో 33.33 శాతం రిజర్వేషన్‌ను బీసీలు పొందుతున్నారు. అయితే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కొంతమేర బీసీలకు రిజర్వేషన్ లభిస్తున్నప్పటికీ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నిక ల్లో మాత్రం తీవ్ర అన్యాయం జరుగుతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నేడు కలెక్టరేట్ల ముట్టడి
రాష్ట్రంలో తక్షణమే సమగ్ర కులగణన ప్రారంభించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారు. కేంద్ర ప్రభు త్వం త్వరలో చేపట్టబోయే జాతి జనగణనలో బీసీ కులగణనలను చేపట్టాలని, బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలను పెంచుకునేందుకు బీసీలంతా పార్టీల అతీతంగా ఏకమై సంఘటితంగా పోరాడి కులగణనను సాధించుకుం దామని బీసీ సంఘాలు పిలుపునిస్తున్నాయి. సెప్టెంబర్ 2వ తేదీన రాష్ట్రవ్యా ప్తంగా అన్ని కలెక్టరేట్లల ముట్టడికి పిలుపునిచ్చాయి. ఈ కార్యక్రమంలో బీసీలంతా పాల్గొని తమ హక్కులను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.
బీసీల ఆవేదన..
రాష్ట్రంలో జనాభా పరంగా బీసీలే అధికంగా ఉన్నప్పటికీ రిజర్వేషన్లు మా త్రం అన్ని సామాజిక వర్గాల కంటే తక్కు వ పొందుతున్నారు. జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు దక్కుతున్నాయి. రిజర్వేషన్ లేకుండానే అగ్రకు లాలకు రాజకీయంగా యాభై శాతం వాటా దక్కుతుంది. విద్య, ఉద్యోగాల్లో అగ్రకులాల జనాభా ఏడు శాతం ఉంటే ఈడబ్ల్యూఎస్ పేరుతో 10 శాతానికి పెం చారు. బీసీల జనాభా 60 శాతం ఉన్నా రిజర్వేషన్లు మాత్రం 18 శాతం నుంచి 23 శాతం వరకే దక్కుతున్నాయి. విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లలో బీసీలకు సరైన ప్రాధాన్యత లభించాలంటే కులగణన తప్పనిసరి.
కాంగ్రెస్ యూ టర్న్ తీసుకుంటుందా?
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పా టు తర్వాత బీసీ కులగణనపై మంత్రివర్గంలో తీర్మానం చేయడంతోపాటు, ఫిబ్ర వరిలో జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేశా రు. కులగణనకు సంబంధించి జీవో 26 ను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ప్రక్రియ కోసం రూ.150 కోట్లను కూడా కేటాయించింది. ఇంతలో పార్లమెంట్ ఎన్నికలు రావడంతో కులగ ణనకు బ్రేక్ పడింది. అయితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కులగణన ప్రక్రియ ప్రారంభిస్తారని బీసీలు భావించారు.
కానీ ఈ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం యూ టర్న్ తీసుకున్నట్టు బీసీలు అనుమానపడుతున్నారు. కులగణన ప్రక్రియ కు చాలా సమయం పట్టేలా ఉందని, అందుకే ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించే యోచన ప్రభుత్వం ఉంది. దీంతో ఎన్నికల ముందు బీసీల ను ఓట్ల కోసం వాడుకుని అధికారంలోకి వచ్చి ఇప్పుడు తమ సమస్య పరిష్కారంపై దృష్టి సారించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీ కులగణన ప్రక్రి య పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరిపై బీసీ సంఘాలు మండిప డుతున్నాయి.
కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ హామీ..
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సందర్భంగా కులగణన నిర్వహించే అంశంపై స్పష్టమైన హామీ ఇచ్చింది. ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్ల పెంచుతామని తేల్చి చెప్పింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 23 శాతానికి పరిమితమైన బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడం ద్వారా రాష్ట్రంలో స్థానిక సంస్థ ల్లో మరో 23,973 మంది బీసీల ప్రాతినిథ్యానికి అవకాశం లభిస్తుందని తెలిపింది. ఆ దిశగా కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్ సమస్యకు పరిష్కారం చూపిస్తామని పేర్కొంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా బీసీ కులగణన, రిజర్వేషన్ల పెంపు తర్వాతనే పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తామని ప్రకటించారు. కానీ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్నా బీసీ కులగణన, రిజర్వేషన్ల పెంపు అంశం మాత్రం కొలిక్కి రాలేదు.
గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీ
రిజర్వేషన్లు షెడ్యూల్డ్ ఏరియాల్లో..
ఎన్నిక స్థానాలు రిజర్వేషన్
వార్డు మెంబర్ 19,384 ఎస్టీ
సర్పంచులు 2,458 ఎస్టీ
ఎంపీటీసీలు 151 ఎస్టీ
జెడ్పీటీసీలు 0 ఎస్టీ
నాన్ షెడ్యూల్డ్ ఏరియాల్లో..
ఎన్నిక స్థానాలు ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్
వార్డు మెంబర్ 93,970 19.46 6.64 23.59 50.31
సర్పంచులు 10,293 20.53 6.68 22.78 50
ఎంపీటీసీలు 5,692 18.31 11.49 17.87 50.53
జెడ్పీటీసీలు 539 17.44 14.66 16.88 51.02
పట్టణ స్థానిక సంస్థల్లో (రిజర్వేషన్ శాతం)..
ఎన్నిక స్థానాలు ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్
మున్సిపాలిటీస్ 2,849 14.07 5.75 29.55 50.61
మున్సిపల్ కార్పొరేషన్స్ 511 13.11 3.32 33.46 50.09
జీహెచ్‌ఎంసీ 150 6.66 1.33 33.33 58.66