తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్
ముషీరాబాద్ (విజయక్రాంతి): కులల వారీగా జనాభాను బట్టి రిజర్వేషన్ అమలు చేయాలని తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్ కోరారు. ఈ మేరకు బుధవారం బీసీ డెడికేషన్ కమిషన్ చైర్మన్ వెంకటేశ్వరరావును తన కార్యాలయంలో కలిసి బీసీలకు, గౌడ్స్ కు న్యాయంగా రావాల్సిన హక్కులపై వినతి పత్రం అందజేశారు. అనంతరం చైర్మన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్, రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ లు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే దాదాపుగా పూర్తి కావచ్చిందని మెత్తం జనాభాలో సగానికి పైగా బీసీలు ఉంటే అన్ని రంగాలలో అన్యాయం జరుగుతుందని వివిధ కులాల వారిగా వారి వారి జనాభాను బట్టి రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు.
గత ప్రభుత్వం బీసీల హక్కులను కాలరాసిందని విమర్శించారు. ఉన్న రిజర్వేషన్లను కుదించి స్థానిక సంస్థలలో, మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో అన్యాయం చేసిందన్నారు. చట్టసభలలో రాజకీయ రిజర్వేషన్లు వచ్చేంత వరకు మా పోరాటం ఆగదని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ చైర్మన్ యెలికట్టే విజయకుమార్ గౌడ్, బీసి కుల సంఘాల చైర్మన్ కుందారం గణేషా చారి తదితరులు పాల్గొన్నారు.