11-02-2025 01:29:36 AM
ఎస్సీల కుల ధ్రువీకరణపై పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): పీజీ మెడికల్ అడ్మిషన్లలో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలను అనుమతించాలంటూ దాఖలైన పిటిషన్లను సోమవారం హైకోర్టు కొట్టివేసింది. ఎపీలో పొందిన కుల ధ్రువీకరణ పత్రాల ద్వారా ఇక్కడ రిజర్వేషన్లు కల్పించాలంటూ అనుమతి మంజూరు చేయలేమని స్పష్టం చేసింది.
ఏపీ ధ్రువీకరణ పత్రంతో సమర్పించిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుని కౌన్సెలింగ్ ప్రక్రియకు అనుమతించాలని, కానీ.. ఫలితాలను వెల్లడించ రాదం టూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసింది.
తెలంగాణ అధీకృత అధి కారులు తాజాగా జారీ చేసిన ఎస్సీ/ఎస్టీ/బీసీ కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పిం చినవారికే పీజీ మెడికల్ అడ్మిషన్లలో రిజర్వేషన్లు కల్పిస్తామన్న నిబంధనను సవాల్ చేస్తూ ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన నిహారికతో పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ రేణుక యారాతో కూడిన బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది.
పిటిషనర్ల తరఫున అడ్వొకేట్ బీ మయూరరెడ్డి తన వాదనలు వినిపిస్తూ.. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఎస్సీ ధ్రువీకరణ పత్రాన్ని రిజర్వేషన్ల కేటాయింపునకు అనుమతించబోమన్న తెలంగాణ ప్రభుత్వం తీరుతో ఎస్సీలకు అన్యాయం జరుగుతున్నదన్నారు. ఇటీవల హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల కారణంగా పిటిషనర్లను స్థానికులుగా పరిగణిస్తున్నప్పటికీ ఎస్సీ రిజర్వేషన్ కేటగిరీ పరిధిలో పరిగణించడం లేదన్నారు.
పీజీ మెడికల్ అడ్మిషన్లకు సంబంధించి గత ఏడాది ఏప్రిల్ 16న నోటిఫికేషన్ జారీ కాగా, ఆ తర్వాత కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయని, ఇవి చెల్లుబాటు కావని వాదించారు. తర్వాత ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి తన వాదనలు వినిపిస్తూ.. ఏపీ నుంచి విడిపోయిన రాష్ట్రం తెలంగాణ అని, ఇలాంటి సందర్భంలో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన కులధ్రువీకరణ పత్రాన్ని తెలంగాణలో ఆమోదించాలని కోరడం సరికాద న్నారు.
రాష్ట్ర పునః వ్యవస్థీకరణ చట్టం షె డ్యూల్ 5 ప్రకారం తెలంగాణ పరిధిలోని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకే రిజర్వేషన్లు వర్తిస్తాయని, ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఎస్సీ ధ్రువీకరణ పత్రం ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తే రాష్ట్రవిభజన జరగి ఏం ప్రయోజనమని అభిప్రాయపడ్డారు. ధర్మాసనం స్పందిస్తూ.. పిటిషనర్ ఏపీ ప్ర భుత్వం జారీ చేసిన ధ్రువపత్రంతో తెలంగాణలో రిజర్వేషన్లు పొందలేరని స్పష్టం చేసింది.