calender_icon.png 26 October, 2024 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలి

13-09-2024 12:00:00 AM

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, సెస్టెంబర్ 11(విజయక్రాంతి): కులగణన పూర్తిచేసి బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీ హనుమంతరావుతో కలిసి మాట్లాడారు.

ఉన్నత  వృత్తి విద్యా కోర్సుల్లో బీసీలకు చెల్లించాల్సిన రూ.4వేల కోట్ల బకాయిలు నాలుగేండ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను రూ.15 వందల నుంచి రూ.3 వేలకు పెంచాలని కోరారు. గురుకుల పాఠశాల్లోని 8,9,10 తరగతుల విద్యార్థుల మెస్ చార్జీలను రూ.1,100 నుంచి రూ.1,600కు పెంచి, పౌష్టికాహారం అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎ. కోదండరాం మాట్లాడుతూ రాష్ట్రంలో కొట్లాడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చామని..

హాస్టళ్లలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారు. విద్యార్థులు పౌష్టికాహారం తీసుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉండి, విద్యలో రాణిస్తారన్నారు. మాజీ ఎంపీ వీ హనుమంతరావు మాట్లాడుతూ.. కుల గణనతోనే బీసీ సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ ముదిరాజ్, బీసీ యువజన జాతీయ అధ్యక్షుడు భరత్ కుమార్, రఘుపతి, కురుణశ్రీ తదితరులు పాల్గొన్నారు.