14-12-2024 12:00:00 AM
విశ్వవిద్యాలయం అనగానే అక్కడ కేవలం బోధనకే కాక పరిశోధనలకూ ప్రాధాన్యం ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. విశ్వవిద్యాలయ అధ్యాపకులు పరిశోధకులుగా ఉన్నప్పుడు అటు వారికీ, ఇటు విశ్వవిద్యాలయానికి మంచిపేరు వస్తుంది. అధ్యాపకులు పర్యవేక్షకు లుగా ఉండి విద్యార్థులను పరిశోధనవైపు మళ్లించాలి. ఈ నేపథ్యంలో ఆసక్తి లేని అధ్యాపకులూ కొందరు పర్యవేక్షకులుగా ఉండవలసి వస్తుంది. పీజీ డిగ్రీ వచ్చింది కనుక పరిశోధకులుగా చలామణి కావాలనుకునే విద్యార్థులూ కొందరు ఉంటారు. కొంతమంది విద్యార్థులకు హాస్టల్ వసతి ఉంటుంది కనుక పరిశోధకులుగా మారుతారు.
లేనివారు బాధ పడతారు. సాధార ణంగా ఎంతోమంది ఎంఫిల్, పీహెచ్‌డీ పరిశోధనకుగాను రిజిస్టర్ చేయించుకుంటారు. కానీ, అందరూ పూర్తి చేయలేరు. పరిశోధకులుగా చేరేవారిలో సిఫారసులతో వచ్చిన వారూ ఉంటారు. రిజర్వేష న్లతో చేరిన వారుకూడా ఉంటారు. ఇక, కొందరు శాఖాధ్యక్షులు తమకు ఇష్టమైన వారికే తమ దగ్గర పరిశోధన చేయడానికి అవకాశం కల్పిస్తారు.
ఇంకొందరు అధ్యాపకులు విద్యార్థులను ప్రోత్సహిస్తే, మరి కొందరు నిరుత్సాహ పరిచేవారూ ఉంటా రు. ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చిందంటే పరిశోధనను మరిచిపోయిన అభ్యర్థులు కూడా మళ్లీ ప్రయత్నశీలురు అవుతారు. తప్పులు లెక్క చేయక సిద్ధాంత వ్యాసాలను సమర్పిస్తారు. అయితే, “పరిశోధనలో ఎవరికి ప్రవేశం కల్పించాలి? ఎవరికి కల్పించకూడదు?” అనే విషయంలో నిర్ణయం తీసుకునే ‘రీసెర్చ్ కమిటీ’ ఒకటి ఉంటుంది. సెట్టు, నెట్టు, జేఆర్‌ఎఫ్ పరీక్షలలో ఉత్తీర్ణులైన వారికి సులభంగా పరిశోధనలో ప్రవేశం లభిస్తుంది. వారు ఏ విషయంపై పరిశోధన చేయాలో వారికే మాత్రం అవగాహన ఉండదు. కొందరు కొన్ని అంశాలను ఎన్నుకుంటే ఇంకొందరు పర్యవేక్షకుల అభిప్రాయం మేరకు పరిశోధనాంశాలను స్వీకరిస్తారు.
పీహెచ్‌డీ పరిశోధన చేసే కాలంలో నేనే నాకు కావలసిన పరిశోధనాంశాన్ని ఎన్నుకున్నాను. ప్రాచీన కావ్యాలంటే నాకు ఇష్టం కనుక, వాటిమీద పరిశోధన చేయాలని సంకల్పించాను. వాటిలోనూ ప్రత్యేకం గా ఏ అంశం మీద పరిశోధన చేయాలో నాకు అప్పటికి అవగాహన లేదు. ఆచార్య ఎస్వీ రామారావు “గ్రామీణ జీవితం మీద చెయ్యి” అని సూచించారు. ‘నేను గ్రామం లో పుట్టిన వాణ్ణి, జానపదుల ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలు తెలి సిన వాణ్ణి’ కనుక ఆయన నాకు ఈ అంశా న్ని సూచించారు. ‘పాచీన కావ్యాల్లో గ్రామీ ణ జీవన చిత్రణ’ అనే అంశాన్ని నా పరిశోధనాంశంగా ఎన్నుకొన్నాను. పర్యవేక్షకు లుగా వేటూరి ఆనందమూర్తి లభించడం నా అదృష్టం. నాకు ఎంఫిల్ పరిశోధన మార్గదర్శకులూ వారే.
పరిశోధకుల తీరుతెన్నులు
మొత్తం ప్రాచీన కావ్యాలను నా పరిశోధనకు తీసుకోవలసిన పని లేదు. ఏ కావ్యంలో గ్రామీణ జీవనం వర్ణితమై ఉందో ఆ కావ్యాలనే తీసుకోవాలి. అలా నా అవగాహనకు ‘50 కావ్యాలు’ వచ్చా యి. నన్నె చోడుని ‘కుమార సంభవం’ నుంచి పొన్నగంటి ‘తెలగన్న’ దాకా ఆయా కవుల కావ్యాలు నాకు ఉపయోగపడ్డాయి. ఎంఏ అయిన తర్వాత నాకు ఎంఫిల్, పీహెచ్‌డీ పరిశోధన పూర్తి చేయడానికి 8 ఏళ్లు పట్టింది. ఆచార్యుల ఇష్టాయిష్టాలనుబట్టి కూడా పరిశోధన సాగుతుంది. ఆచా ర్య ఆనందమూర్తి ఎప్పుడూ నన్ను బాధిం చే వారు కాదు. మెళకువలు బోధించే వారు. పరిశోధన పూర్తి కాకముందే నన్ను ‘డా.చెన్నప్ప..’ అని సంబోధించేవారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నా ఒక క్లాసుమేటుకు ఎంఏ కాగానే పీహెచ్‌డీ పరిశోధనకు అవకాశం ఇస్తే నాకు మాత్రం ఎంఫిల్‌లో అవకాశం ఇచ్చారు.
ఐతే, జరిగింది ఏమిటంటే ఆ క్లాస్‌మేట్‌కు ఒక్క పీహెచ్‌డీ పూర్తి చేయడానికే పదేళ్ల కాలం పట్టింది. పర్యవేక్షకుడు ఆయన బంధువు కూడా. మరొక వ్యక్తి పూర్తి చేయడానికి పన్నెండేళ్లు పట్టింది. ఆ మహానుభావునికి లెక్చరర్ ఇంటర్వ్యూకు వచ్చినప్పుడు డాక్టరేట్ పట్టా లేదు. అయితేనేమి, ‘వడ్డించే వాడు తన వాడైతే బంతిలో ఎక్కడైనా కూర్చోవచ్చు’నంటారు కదా. ఆయనకీ లెక్చరర్ ఉద్యోగం దొరికింది. ఇంకా, సరాసరి నాకంటే ముందుగానే రీడరై, ఫ్రొఫెసరై, వీసీ పోస్టుకు సైతం చేరుకున్నాడు. ఇంతకు ఆయన ఏమైనా రచనలు చేశారా అంటే అదీ లేదు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, ఆయన తన థీసిస్‌ను ఎవరికంటా పడకుండా దాచేశారు. ఇప్పటిదాకా ఆయన దాన్ని ప్రచురించనే లేదు.
మా గురువుగారు డా.సినారె పరిశోధనను గురించి రెండు మాటలు చెప్పేవారు. ఒకటి: ఉపరిశోధన, రెండు: అపరిశోధన. లోతైన అవగాహన, విశ్లేషణ లేకుండా చేసే పరిశోధనే ఉపరిశోధన. ఇక, రెండవ దాని (అపరిశోధన) అర్థం ‘అది అసలు పరిశోధనే కాద ని’ చెప్పడం. పర్యవేక్షకులు కేవలం పరిశోధనా దృష్టి కలిగిన వారు మాత్ర మే ఉండరు. వారికి కూడా ఇచ్ఛాద్వే షాలు ఉంటాయి కదా. అదృష్టవశాత్తు ఒక విద్యా ర్థి తనమీద ఎంఫిల్ చేస్తే ఆ పర్యవేక్షకుడు సంతోషించాలి. కానీ, ఆ విద్యార్థికి ఇష్టం లేకపోయినా తన రచనలపైనే, ఇంకా పీహెచ్‌డీ పరిశోధన కూడా చేయాలని పట్టుబట్టేవారూ ఉంటారు.
ఈ ధోరణి అనైతికం. గమ్మత్తే మింటే, ‘తనపై పరిశోధన చేయనన్న విద్యార్థికి ఏ విశ్వవిద్యాలయంలోను పరిశోధనకు అవకాశం లేకుండా చేస్తాననడం’. ఇలాంటి పర్యవేక్షకులూ ఉంటారంటే ఆశ్చర్యమే మరి. ఇంకా కొందరు పర్యవేక్షకులైతే పరిశోధనకిచ్చే ప్రాధాన్యం కంటే వారి ఇంటి పనులు చేయించుకోవడానికి అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. పర్యవక్షకుడు అంటే పరిశోధన విద్యార్థికి మార్గదర్శకుడు. కానీ, తాను మార్గదర్శకుడనన్న విషయాన్ని మరిచిపోయి, విద్యార్థి భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చడం సరికాదు.
నా పర్యవేక్షణలో ఇప్పటిదాకా 24 మంది పీహెచ్‌డీలు సంపాదించారు. వారికి మార్గదర్శకునిగా ఉండటానికే శతవిధాల ప్రయత్నించాను. నేను స్వయంగా ఉపనిషత్తులపైనా పరిశోధన చేసి వందలాది వ్యాసాలు రాశాను. ఇప్పటికింకా నేను పరిశోధకుడినే. ఏ విద్యార్థికైనా మార్గదర్శకుడిగా ఉండదలచిన పర్యవేక్షకుడు తాను నిరంతర పరిశోధకుడు కావడం సరైన పద్ధతి. అప్పుడే పరిశోధనా విద్యార్థులకు న్యాయం చేయగలడు.
వ్యాసకర్త సెల్: 9885654381