calender_icon.png 8 October, 2024 | 3:57 AM

ట్రాన్స్‌కో పరిధిలో రీసెర్చ్ సెంటర్

08-10-2024 01:58:27 AM

డిమాండ్‌కు తగిన విధంగా విద్యుత్ సరఫరా ఉండాలి

సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క 

హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు ట్రాన్స్‌కో పరిధిలో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క సూచించారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఇంధన శాఖ సెక్రెటరీ రోనాల్డ్ రోస్‌ను ఆదేశించారు.

హైదరాబాద్‌లోని సచివాలయంలో సోమవారం ట్రాన్స్‌కో ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్తు రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ట్రాన్స్‌కోను అప్‌డేట్ చేయాలని సూచించారు. డైరెక్టర్ స్థాయి నుంచి ఏఈ వరకు ప్రతిఒక్కరూ అప్‌డేట్ కావాలన్నారు.

రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్‌కు తగిన విధంగా సరఫరా ఉండాలని, ట్రాన్స్‌కో అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసి, వాటిని కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. ప్రస్తుత డిమాండ్ 15,700 మెగావాట్లు ఉందని, వచ్చే ఏడేండ్లలో ఆ డిమాండ్ 27 వేల మెగావాట్లకు పెరిగే అవకాశం ఉందన్నారు. తొలుత ఆయన ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సబ్ స్టేషన్ల పనులపై ఆరా తీశారు.

నిర్ణీత గడువులోపు  పనులు పూర్తి చేయాలని సూచించారు. రానున్న రెండేళ్లలో ట్రాన్స్‌కో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై డిప్యూటీ సీఎం లోతుగా సమీక్షించారు. . ఇంజినీర్లకు అధునాతన టెక్నాలజీపై ఎప్పటికప్పుడు అవగాహన, శిక్షణ తరగతులు నిర్వహించాలని సూచించారు. డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణభాస్కర్, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు, డైరెక్టర్లు పాల్గొన్నారు.