02-04-2025 12:18:59 AM
నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో ప్రమాదం జరిగి 38 రోజులవుతున్నా మరో ఆరుగురి కార్మికుల జాడ దొరకలేదు. వారి జాడ కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉం ది. మంగళవారం ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి రెస్క్యూ బృందాల నిపుణులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
రెస్క్యూ బృందాలు తరచూ మరమ్మతుకు గురవుతున్న కన్వేయర్ బెల్ట్ పనులను నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. డేంజర్ జోన్ ప్రాంతంలోని 13.800 కిలోమీటర్ల వద్ద మట్టితీత పనులు మినీ జేసిబీల ద్వారా నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది.
అందుకు అడ్డుగా ఉన్న టీబీఎం యంత్రాలను ఎప్పటికప్పుడు ఇండియన్ రైల్వే రెస్క్యూ బృందాలు ప్లాస్మా గ్యాస్ కట్టర్ల ద్వారా వేరు చేసి లోకో ట్రైన్ ద్వారా బయటికి తరలిస్తున్నారు. సహాయక చర్యలకు ఆటంకిగా మారిన నీటి ఊటను ఎప్పటికప్పుడు బయటికి తరలిస్తున్నారు. బుధవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రెస్క్యూ ఆపరేషన్‌ను పరిశీలించనున్నారు.