25-03-2025 11:23:00 AM
కుళ్ళిన స్థితిలో ఉండడంతో అత్యంత జాగ్రత్తగా వెలికితీస్తున్న సహాయక బృందాలు
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల ఆనవాళ్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రమాదం జరిగి 16వ రోజు గురుప్రీత్సింగ్ మృతదేహం వెలికి తీసి ఆ కుటుంబ సభ్యులకు అప్పగించగా తాజాగా మంగళవారం తెల్లవారుజామున మరో మృతదేహం ఆనవాళ్లను గుర్తించినట్లు రెస్క్యూ బృందాల ద్వారా తెలుస్తోంది. అత్యంత ప్రమాదకర ప్రదేశంలోని డి-1 ప్రాంతంలో కేరళ కడావర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశంలో తవ్వకాలు జరుగుతున్న క్రమంలో మృతదేహం అన వాళ్ళను ప్రాథమికంగా నిర్ధారించారు. కానీ ప్రమాదం జరిగి సుమారు 33 రోజులు కావస్తుండగా ప్రమాదం జరిగిన అదే రోజు కార్మికులు మృతి చెందినట్లుగా రెస్క్యూ బృందాలు భావించాయి. ఈ నేపథ్యంలో మృతదేహాలన్నీ కుళ్ళిన స్థితిలోనే ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం గుర్తించిన మృతదేహం ఆనవాళ్ళ ప్రదేశంలో రాట్ హోల్ మైనర్స్, సింగరేణి వంటి బృందాలు అత్యంత జాగ్రత్తగా మృతదేహాన్ని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అనంతరం డిఎన్ఏ ద్వారానే కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. కానీ ఈ అంశంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.