12-03-2025 05:33:45 PM
మరింత స్పీడ్ పెంచిన సహాయక బృందాలు
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): శ్రీశైలం ఎడమ గట్టు సొరంగం(Srisailam Left Bank Tunnel)లో మిగిలిన ఏడు మంది కార్మికుల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ స్పీడ్ పెంచారు. అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్న రెస్క్యూ ఆపరేషన్ ప్రాంతంలో ప్రాణ నష్టం లేకుండా అన్వీ రోబోటిక్స్ సంస్థ(Anvi Robotics Company)కు చెందిన అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబో(Hydraulic Powered Robot)ను రంగంలోకి దించారు. బుధవారం హైడ్రాలిక్ రోబో యంత్రాన్ని సొరంగంలోని 13. 6 ప్రమాద ప్రదేశానికి తీసుకెళ్లారు. రోబో ద్వారా టన్నెల్ లోపల ఉన్న శిథిలాలను తొలగించడం, భూమిని తవ్వడం, వంటి సహాయక చర్యలు చేపడుతున్నట్లు రెస్క్యూ బృందాలు పేర్కొన్నాయి. బుధవారం డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్ఎల్బిసి టన్నెల్ ఆఫీస్‌లో సహాయక చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
రోబో మానవ సహాయక సిబ్బంది చేరలేని ప్రమాదకర ప్రాంతాల్లో పనిచేయడం, మనుషుల కన్నా 15 రెట్లు అత్యధిక సామర్థ్యంతో రోబో పనిచేయడం ప్రత్యేకత అని టన్నెల్‌లో సహాయక చర్యలను వేగంగా పూర్తి చేయడానికి ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించేందుకు పనిచేస్తున్నట్లు తెలిపారు. అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబో ద్వారా 40 హెచ్ పి పంపు సహాయంతో బురదను బయటికి పంపనున్నారు. ఈ రోబో గంటకు 5వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించే సామర్థ్యం కలిగి ఉందని అధికారులు తెలిపారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు, రోబోను పరిశీలించిన అనంతరం, అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోతో విజయ్, అక్షయ్ తమ బృందంతో కలసి లోకో ట్రైన్ ద్వారా టన్నెల్ లోపల ప్రమాద ప్రదేశానికి వెళ్లారు. ప్రస్తుతం సహాయక చర్యల్లో 12 కేంద్ర, రాష్ట్ర సంస్థలకు చెందిన బృందాలు 24 గంటలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. మానవ సహాయక బృందాలకు అవసరమైన సామాగ్రి, నీరు, మెడికల్ సపోర్ట్, ఆక్సిజన్ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.