13-03-2025 01:56:40 AM
నాగర్‌కర్నూల్ మర్చి 12 (విజయక్రాంతి): శ్రీశైలం ఎడమగట్టు సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న 8 మందిలో మిగిలిన ౭గురు కార్మికుల ఆచూకీ కోసం సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌ను వేగవంతం చేశాయి. అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్న డేంజర్ జోన్ రెస్క్యూ ఆపరేషన్ ప్రాంతంలో ప్రాణనష్టం లేకుండా అన్వీ రోబోటిక్స్ సంస్థకు చెందిన అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోను, ఏఐ టెక్నాలజీతో మూడు రకాల రోబోలను రంగంలోకి దింపారు.
ఇవి సుమారు ఒక మనిషి చేసే పని కంటే 15 రెట్లు అధిక వేగంతో పనిచేస్తున్నాయని రోబో నిపుణుల బృందం పేర్కొం ది. బండరాళ్లను చూర్ణం చేసి కన్వేయర్ బెల్ట్ వరకు మోసుకురావడం, మట్టిని తవ్వి దాన్ని కూడా కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి తోడేయడం, వ్యాక్యూమ్ క్లీనర్ మాదిరి బురదను సేకరించి కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి పంపే విధానాన్ని బుధవారం మాస్టర్ రోబో సహాయంతో ఇన్‌స్టాలేషన్ చేశారు.
డీ 2 వద్ద స్వాధీనం చేసుకున్న గురుప్రీత్ సింగ్ మృతదేహం వద్దే మరో ఇద్దరు కార్మికుల ఆనవాళ్లు ఉన్నట్టు జీపీఆర్ రాడార్, కేరళ కడావర్ గుర్తించిన ప్రదేశాల్లో రెండు రోజులపాటు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమించి తవ్వకాలు జరిపాయి. అయినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో డీ 2 నుంచి డీ 1 ప్రాంతానికి రెస్క్యూ ఆపరేషన్‌ను మార్చారు.
ఆ ప్రదేశంలో సుమారు 8 ఫీట్ల ఎత్తులో బురదమట్టి కాంక్రీట్ రూపంలో పేరుకుపోయి తవ్వకాలు జరిపేందుకు కూ డా తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. తవ్వకా లు జరిపే క్రమంలోనూ సొరంగంలోని పై భాగం నుంచి నీటిఊటతో పాటు భారీగా బురద మట్టి కూలుతోందని రెస్క్యూ బృందాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో సింగరేణి రెస్క్యూ బృందాల సూచన మేరకు ఆ ప్రాంతంలో పాజిటివ్ రూఫ్ సపోర్ట్ విధానం అమలు చేస్తూ భారీ చెక్కతో కూడిన దుంగలు ఏర్పాటు చేశారు.