calender_icon.png 1 November, 2024 | 7:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బయ్యర్లకు రక్షణగా రెరా

12-05-2024 02:11:50 AM

సత్ఫలితాలిస్తున్న సంస్కరణలు

కొత్త చట్టంతో రియల్ మోసాలకు అడ్డుకట్ట

కొనుగోలుదారుల ఫిర్యాదులకు ఎప్పటికప్పుడు పరిష్కారం

తెలంగాణలో భిన్నంగా రెరా పనితీరు

హైదరాబాద్ సిటీబ్యూరో, ప్రధాన ప్రతినిధి, మే 11 (విజయక్రాంతి): దేశంలో నిర్మాణ రంగం రూపురేఖలు మారుతున్నాయి. పెరుగుతున్న పట్టణీకరణతో పాటు నిర్మాణ రంగంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల ఫలితంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా రెగ్యులేటరీ సంస్కరణల దగ్గర నుంచి మార్కెట్ డైనమిక్స్, సాంకేతికను అందిపుచ్చుకోవడం, కొనుగోలుదారుల ప్రాధాన్యాలు మారడం వంటి అంశాలు రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం చూపుతున్నాయి.

2016లో రియల్ ఎస్టేట్ రెగ్యులేటింగ్ యాక్ట్ (రెరా) అమల్లోకి వచ్చిన తర్వాత స్థిరాస్తి రంగం ముఖచిత్రమే మారిపోయింది. స్థిరాస్తి రంగంలో భారీ మార్పులు వచ్చాయి. రియల్ మోసాలను నియంత్రించడంతో పాటు కొనుగోలుదారుల హక్కులకు రెరా రక్షణ కవచంగా మారింది. రియల్ రంగంలో పారదర్శకత పెంపొందించడంతో పాటు జవాబుదారీతనం పెరుగుతుంది. అటు కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడుతూనే రియల్ పరిశ్రమ అభివృద్ధికి రెరా దోహదపడుతోంది. రెరా రాక ముందు ఈ రంగం అనేక సవాళ్లతో కొట్టుమిట్టాడుతుండేది

. ముఖ్యంగా పారదర్శకత లేకపోవడం, రియల్ అక్రమాలతో బయ్యర్లు రోడ్డున పడటం, నిర్ణీత కాలంలో ప్రాజెక్టులను పూర్తిచేయలేక పోవడం, కొనుగోలుదారులు, డెవలపర్ల మధ్య వివాదాలు తలెత్తడం వంటివి గతంలో నిత్యకృత్యంగా ఉండేవి. కానీ రెరా చట్టం ఇలాంటి సమస్యలన్నింటికీ చెక్ పెట్టింది. ప్రసుత్తం డెవలపర్లలో జవాబుదారీతనం, పారదర్శకత క్రమంగా పెరుగుతోంది. అలాగే గత పదేండ్లుగా దేశంలో రియల్ ఎస్టేట్ రంగం గణనీయమైన వృద్ధిని నమోదు చేసుకోవడంతో పాటు ప్రభుత్వాలకు అతిపెద్ద ఆదాయ వనరుగా ఈ రంగం మారింది.  

బయ్యర్లకు పెద్దదిక్కు...

దేశంలో బయ్యర్లకు రెరా పెద్ద దిక్కుగా మారిందని చెప్పవచ్చు. గతంలో రియల్ మోసాలకు గురైన వాళ్లు పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ రెరా అమలుతో కొనుగోలుదారుల సమస్యలకు ఒక పరిష్కారమార్గంగా మారింది. రెరా అమల్లోకి వచ్చాక అనుమతి పొందిన ప్రాజెక్టులు ఎన్ని? వచ్చిన ఫిర్యాదులు ఎన్ని? వాటిలో పరిష్కారమైనవి ఎన్ని వంటి వివరాలతో ఆన్‌రాక్ గ్రూప్, నరెడ్కో కలిసి కొద్ది రోజుల కిందట ఓ నివేదిక విడుదల చేశాయి. దాని ప్రకారం రెరా వచ్చిన తర్వాత దేశ్యవాప్తంగా సుమారు 1,21,891 ప్రాజెక్టులు, 92,557 మంది ఏజెంట్లు రెరాలో నమోదు చేసుకున్నారు.

మొత్తం 20 రాష్ట్రాల్లో 97,784 ఫిర్యాదులు రెరా యంత్రాంగం పరిష్కరించింది. తెలంగాణలో ఇప్పటివరకు రెరాలో 8,045 ప్రాజెక్టులు నమోదు కాగా, 3,342 మంది ఏజెంట్లుగా రిజిస్టర్ అయ్యారు. 1,092 ఫిర్యాదులను పరిష్కరించారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 4,617 ప్రాజెక్టులు నమోదు కాగా, 195 మంది ఏజెంట్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పటివరకు 163 ఫిర్యాదులు పరిష్కారమయ్యాయి. 

తెలంగాణలో భిన్నంగా..

తెలంగాణలో రెరా పనితీరు కాస్త భిన్నంగా ఉంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా రియల్ మోసాలపై ముందస్తుగా గుర్తించి చర్యలు తీసుకోవడంలో తెలంగాణలోని రెరా అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ముఖ్యంగా ప్రీలాంచ్‌లను అరికట్టడంలో ఉన్నతాధికారుల ఉదాసీనత కొట్టొచ్చినట్లు కనబడుతుంది. అనుమతులు లేకుండానే ప్రాజెక్టులను నిర్మిస్తుండటం, కోర్టు వివాదాల్లో ఉన్న భూములలో యధేచ్ఛగా నిర్మాణాలు జరుగుతున్నా.. రెరా అడ్డుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే దేశంలోని సుమారు 20 రాష్ట్రాలలో రెరా కార్యకలాపాలు పూర్తిస్థాయిలో కొనసాగుతున్నాయి.

అయితే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా రెరా పనితీరు ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని రాష్ట్రాలలో కొనుగోలుదారులకు రెరా అండగా ఉండగా మరికొన్ని రాష్ట్రాలలో బిల్డర్లకు అండగా ఉంటున్నాయనే ఆరోపణలున్నాయి. కొనుగోలుదారులు నష్టపోకుండా రెరా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని నరెడ్కో (నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్) వంటి సంస్థల ప్రతినిధులు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. కొనుగోలుదారులను మోసం చేసే బిల్డర్ల పట్ల రెరా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే బయ్యర్లు కూడా జాగ్రత్తగా ఉండాలని వారు సూచిస్తున్నారు. రెరాలో నమోదైన ప్రాజెక్టుల్లో మాత్రమే ప్లాట్లను కొనుగోలు చేయాలని రియల్ నిపుణులు సూచిస్తున్నారు.