హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 20 (విజయక్రాంతి): రెరాలో నమోదు చేసే ప్రతి ప్రాజెక్టుకు క్యూఆర్ కోడ్ ఇవ్వాలని ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర రెరా నిర్ణయించింది. కొత్త ప్రాజెక్టులతో పాటు సరైన రిజిస్ట్రేషన్ కలిగిన ప్రతి ప్రాజెక్టుకు క్యూఆర్ కోడ్ ఇవ్వనున్నారు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రజలు, బయ్యర్లు నేరుగా రెరా వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని అక్కడి ప్రభుత్వం సూచిస్తుంది. అయితే రెరా కేటాయించిన క్యూఆర్ కోడ్‌ను రియల్టీ ప్రాజెక్టు ప్రకటనలపై కూడా ముద్రించాలని ఉత్తర్‌ప్రదేశ్ రెరా చైర్మన్ సంజయ్ భూసిరెడ్డి రియల్ వ్యాపారులకు సూచించారు. కొనుగోలుదారులకు అందించే బుకింగ్ ఫారాలు, అలాట్‌మెంట్ లెటర్లు, బీబీఏలలో కూడా క్యూఆర్ కోడ్ ముద్రించాలని కోరారు. దీంతో ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి పత్రాలను బయ్యర్లు పొందే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.