05-04-2025 04:22:51 PM
మంచిర్యాల (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వము బీసీ ఫెడరేషన్లకు నిధుల విడుదల చేయాలని కోరుతూ శనివారం మంచిర్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డులో గల తెలంగాణ తల్లి విగ్రహానికి జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కులవృత్తులు చేసుకొని జీవించే వారిని ఆదుకునేందుకు నిధులు విడుదల చేయాలని కోరారు. ప్రత్యేక రాష్ట్రం సిద్ధిస్తే కులవృత్తులకు న్యాయం జరుగుతుందని, రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బీసీ కులాలకు అన్యాయమే ఎదురవుతుందన్నారు.
1984లో అప్పటి ప్రభుత్వం కులవృత్తులకు ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఫెడరేషన్ లను ఏర్పాటు చేసిందని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు అన్నారు. పదేండ్ల బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఫెడరేషన్ లకు నిధులు విడుదల చేసిన పాపాన పోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం నర అవుతున్నా ఫెడరేషన్ల నిధుల విడుదలపై ఎలాంటి ఊసెత్తకపోవడం బాధాకరమన్నారు.
ఒక్కో ఫెడరేషన్ కు రూ. 5 వేల కోట్లు కేటాయించాలి...
కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న కులాల ఆర్థిక అభివృద్ధికై ఒక్కొక్క ఫెడరేషన్ కి రూ. 5 వేల కోట్ల బడ్జెట్ విడుదల చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. అలాగే నూతనంగా ఏర్పాటు చేసిన బీసీ కార్పొరేషన్లకు రూ. 2 వేల కోట్ల చొప్పున బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు కర్రే లచ్చన్న, రాష్ట్ర కార్యదర్శి అక్కల రమేష్, జిల్లా కార్యదర్శి శాఖపూర్ భీం సేన్, నాయకులు బండ సతీష్, బర్ల రమేష్, ఆరెంధుల రాజేశం తదితరులు పాల్గొన్నారు.