బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని షంషీర్ నగర్ ప్రాంతంలో గల ప్రభుత్వ భూములను కాపాడాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ దీపక్ కుమార్ కు బెల్లంపల్లి కన్నాల బస్తికి చెందిన దాసరి అజయ్ అనే యువకుడు వినతి పత్రం అందజేశారు. టిడిపి పార్టీకి చెందిన అమానుల్లాఖాన్, టి. మణిరాంసింగ్ లు బెల్లంపల్లికి చెందిన కొంతమంది వ్యక్తులతో ముఠాగా ఏర్పడి ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారని వినతి పత్రంలో ఫిర్యాదు చేశారు.
షంషీర్ నగర్ ఉర్దూ మీడియం ఎదురుగా షెడ్డు నిర్మాణం చేసి హార్డ్వేర్ దుకాణానికి కిరాయి ఇచ్చారని ఫిర్యాదు చేశారు. ఇదే ప్రాంతంలో చర్చి ప్రక్కన బేస్ మెంట్ కట్టి ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని పేర్కొన్నారు. బెల్లంపల్లి కాంట వద్ద టీడీపీ కార్యాలయం పేరిట షెటర్ నిర్మించి జనరిక్ మందుల దుకాణానికి కిరాయికి ఇచ్చారని పేర్కొన్నారు. జిల్లా అధికారులు స్పందించి రూ. కోట్లాది విలువగల ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్న సదరు వ్యక్తులపై చర్యలు తీసుకొని ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని వినతి పత్రంలో కోరారు.