25-02-2025 06:56:03 PM
ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.ఎన్. రెడ్డి...
ముషీరాబాద్ (విజయక్రాంతి): పదవ తరగతిలో గత పది సంవత్సరాలుగా కొనసాగుతున్న గ్రేడింగ్ విధానాన్ని యధావిధిగా కొనసాగించాలని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) వ్యవస్థాపక అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.ఎన్.రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే. అనిల్ కుమార్, కోశాధికారి కే. శ్రీకాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, టిపిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ లను కలిసి వినతిపత్రాన్ని అందజేసినట్లు వారు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పాఠశాలల సమస్యలపై సమావేశాన్ని ఏర్పాటు చేసి బడ్జెట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ను మూడు కేటగిరీలుగా విభజించాలని అన్నారు. తక్కువ ఫీజు తీసుకొని మంచి ఫలితాలు సాధిస్తున్న బడ్జెట్ పాఠశాలలకు విద్యుత్, నీటి, ప్రాపర్టీ టాక్స్ తగ్గించాలన్నారు.
అదేవిధంగా కార్పొరేట్ విద్యాసంస్థలను నియంత్రించాలన్నారు. గత 10 ఏండ్లుగా కాలేజీల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అలాంటి విద్యాసంస్థలను నియంత్రించాలన్నారు. బడ్జెట్ పాఠశాలలకు అదే విధంగా విద్యుత్ బిల్లును కేటగిరి 7 లోకి తీసుకోవాలని అన్నారు. ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు కల్పించాలని, పాఠశాలల్లో పని చేస్తున్న నాలుగో తరగతి సిబ్బందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలన్నారు. ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ లు త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి బడ్జెట్ పాఠశాలల సమస్యలను పరిష్కరించేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపినట్లు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా ముఖ్య సలహాదారు కే. అనంతరెడ్డి, అధికార ప్రతినిధి సి. రామ్ చందర్ తదితరులు పాల్గొన్నారు.