calender_icon.png 22 February, 2025 | 3:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హోర్డింగ్స్ వ్యాపారస్తుల సమస్యను సీఎం దృష్టికి

22-02-2025 12:26:55 AM

టీపీపీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ 

హోర్డింగ్స్ తొలగింపును అడ్డుకోవాలని వ్యాపారస్తుల వినతి 

ఎల్బీనగర్, ఫిబ్రవరి 21 : హోర్డింగ్స్ వ్యాపారస్తుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్ పేర్కొన్నారు. నగర శివారు మున్సిపాలిటీల్లో ఇటీవల హైడ్రా అధికారుల హోల్డింగ్స్ తొలగింపు నేపథ్యంలో హోర్డింగ్స్ వ్యాపారస్తులు శుక్రవారం మధుయాష్కీగౌడ్ ని కలిసి తమ సమస్యను వివరించారు. ఈ సందర్భంగా వ్యాపారులు మాట్లాడుతూ.. అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్ తొలగింపుతో తాము రోడ్డున పడుతున్నామని, ప్రభుత్వంతో మాట్లాడి తమ ఇబ్బందులను తొలగించాలన్నారు.

హైదరాబాద్ నగరంతో పాటు వివిధ జిల్లాల్లోనూ స్వయం ఉపాధిలో భాగంగా 20 ఏండ్లకు పైగా అడ్వర్టైజ్మెంట్ హోర్డింగు వ్యాపారం నిర్వహిస్తున్నామ న్నారు.  ప్రభుత్వానికి అన్ని విధాలుగా ట్యాక్స్ చెల్లిస్తున్నామని తెలిపారు. అడ్వర్టైజ్మెంట్ హోర్డింగు వ్యాపారంపై ప్రత్యక్షంగా,  పరోక్షంగా దాదాపు 10 వేల మంది ఆధారపడ్డారని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొస్తామని చెప్పి.. సీడీఎంఏ ఆన్‌లైన్ పోర్టల్ నిలిపివేయడంతో.. హోర్డింగ్స్‌కు అనుమతి తీసుకోవడం, టాక్స్ చెల్లించడం వీలు కావడం లేదన్నారు. 

ఈ క్రమంలో 2024- 25 ఆర్థిక కాలానికి టాక్స్ కట్టలేక పోయామన్నారు. కానీ, ఇటీవల హైడ్రా అధికారులు తమ హోర్డింగ్స్ తొలగించడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ట్యాక్స్ చెల్లిస్తామని, అనుమతులు ఇవ్వాలని కోరినా వినకుండా హోర్డింగ్స్ ను   తొలగిస్తుండడంతో రోడ్డున పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.  పెద్ద పెద్ద కంపెనీలకు అనుమతులు చిన్న వ్యాపారస్తులను రోడ్డున పడేయడం సబబు కాదన్నారు. సీఎం, మంత్రులతో మాట్లాడి తమ సమస్యను పరిష్కరించాలని  కోరారు.