కరీంనగర్/జగిత్యాల/పెద్దపల్లి/సిరిసిల్ల, జనవరి 26 (విజయక్రాంతి): కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వాడవాడలా జాతీయ పతాకం రెపరెపలాడింది. కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆవిష్కరించారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ కనీసం 20 రోజులు పనిచేసిన జిల్లాలోని 16,665 మంది ఉపాధి హామీ కూలీలను ఇప్పటి వరకు ఇందిరమ్మ జాతీయ భరోసా పథకం కింద గుర్తించడం జరిగిందని తెలిపారు. గ్రామ సభలలో ఆమోదం పొందినవారికి 6 వేల రూపాయల చొప్పున రెండు. విడతలుగా చెల్లించడం జరుగుతుందన్నారు. అర్హులైన నిరుపేదలందరికి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు.
జిల్లాలో కొత్త రేషన్ కార్డుల కోసం, కార్డుల మార్పు కోసం 40 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని, పారదర్శకంగా పరిశీలించి నూతన కార్డులు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, జిల్లాలో 2,10,000 మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.
మహాలక్ష్మీ పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 3 కోట్ల 14 లక్షల 82 వేల మంది మహిళలు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారని, దీని ద్వారా 125 కోట్ల 50 లక్షల రూపాయల లబ్ది పొందారని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద జిల్లాలో 20,474 మందికి ఉచిత చికిత్స అందించినట్లు తెలిపారు. జిల్లాలో 1,43,893 గ్యాస్ కనెక్షన్లకు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగిస్తున్న 1 లక్ష 54 వేల కుటుంబాలు ఉచిత విద్యుత్‌ను పొందుతున్నాయని తెలిపారు.
వాడవాడలా....
తీగలగుట్టపల్లిలోని తెలంగాణ భవన్లో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారడాసు లక్ష్మణరావుతోపాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
సీపీఐ కార్యాలయం వద్ద ఆ పార్టీ కార్యదర్శి మర్రి వెంకటస్వామి ఆవిష్కరించారు. కరీంనగర్ న్యూ బస్టాండ్. ఫోర్వోలర్స్ అసోసియేషన్, గోదాంగడ్డ ఆటోస్టాండ్, ఆదర్శ యూత్ క్లబ్, పెద్దమ్మ యూత్ క్లబ్, ముదిరాజ్‌సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.
కరీంనగర్ రూరల్ మండలం బహదూర్ ఖాన్ పేట, సుడా కార్యాలయంలో జరిగిన వేడుకల్లో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆవిష్కరించారు. సీపీ కార్యాలయంలో సీపీ అభిషేక్ మొహంతి, కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ పమేలా సత్పతి, రెవెన్యూ కార్యాలయంలో అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. చొప్పదండి నియోజకవర్గం చిట్యాలపల్లిలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
జగిత్యాల జిల్లాలో....
జగిత్యాల పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన వేడుకల్లో కలెక్టర్ బి సత్య ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వేడుకల్లో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 24,147 మందిని జాతీయ ఉపాధి హామీ కూలీలను ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఎంపిక చేసినట్లు తెలిపారు.
జిల్లాలో రైతు భరోసా కింద 2 లక్షల 20 వేల మంది రైతులకు 208 కోట్ల 93 లక్షలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. రేషను కార్డుల కోసం కొత్తగా 49,899 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. 500 రూపాయల గ్యాస్ కనెక్షన్ కింద 2 లక్షల 89 వేల మందికి అందించడం జరుగుతుందని, ఒక లక్షా 93, 686 మందికి గృహ జ్యోతి కింద 200 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు.
పెద్దపల్లి జిల్లాలో..
పెద్దపల్లిలో కలెక్టర్ కోయ శ్రీహర్ష జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, మక్కాన్‌సింగ్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 446 కోట్ల 54 లక్షలతో జిల్లాలో 58,896 మంది రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. ప్రాథమికంగా 13,638 మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, 12,205 మందికి నూతన రేషను కార్డులు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు.
11 కోట్ల 29 లక్షల సబ్సిడీతో 3 లక్షల 80 వేల గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం కింద 2 కోట్ల 40 లక్షలకు పైగా మహిళలకు 0 టికెట్ జారీ చేశామని, 11 కోట్ల 29 లక్షల సబ్సిడీని ప్రభుత్వం భరించిందని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా జిల్లాలోని 477 పాఠశాలల్లో 15 కోట్ల 54 లక్షల రూపాయలు ఖర్చు చేసి మౌలిక వసతులు కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి అనంత్ కుమార్, జూనియర్ సివిల్ జడ్జి ఎస్ మంజుల, ఏసీపీ చేతన, అదనపు కలెక్టర్ అరుణ, డి వేణు, పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో...
సిరిసిల్ల పోలీస్ పరేడ్ మైదానంలో కలెక్టర్ ప్రదీప్ కుమార్ ఝూ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు రుణమాఫీ నాలుగు విడతల్లో 44,620 మంది రైతులకు 352 కోట్ల 74 లక్షల రూపాయలరు రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. మహాలక్ష్మీ పథకం కింద సుమారు 73 కోట్ల 42 లక్షల విలువగల ఒక కోటి 95 లక్షల మంది మహిళలు 0 టికెట్ల ద్వారా ప్రయాణం చేయడం జరిగిందని తెలిపారు.
ఇందిరమ్మ మహిళా శక్తి పేరుతో జిల్లాలో మూడు క్యాంటీన్లను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ సరఫరా ద్వారా ఇప్పటి వరకు 93,104 మంది కుటుంబాలకు బ్యాంకు ఖాతాల్లో 7 కోట్ల 35 లక్షల 39 వేలు జమ చేయడం జరిగిందని తెలిపారు. గృహజ్యోతి కింద 9 లక్షల 44 వేల 834 మందికి జీరో బిల్లులు జారీ చేయడం జరిగిందని తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని, 75 కోట్లతో వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారని తెలిపారు. సిరిసిల్లలో నేతన్నలకు నేతన్న పొదుపు, నేతన్న భరోసా, నేతన్న భద్రత పథకాలు అమలు చేస్తున్నామని, వివిధ శాఖల ఆర్డర్ పెండింగ్ బకాయిలు 375.85 కోట్లను చెల్లించడం జరిగిందని, 60 లక్షల ఆర్వీఎం క్లాత్‌లు ఆర్డర్ చేయడం జరిగిందని, 50 కోట్లతో ఏర్పాటు చేసిన యార్న్ యార్డ్ విజయవంతంగా కొనసాగుతుందని తెలిపారు.
పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి సారించిందని, కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో 9, 10, 11, 12 ప్యాకేజీ పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎస్పి అఖిలమహజన్, అదనపు కలెక్టర్ బీమ్లా నాయక్ పాల్గొన్నారు.