మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో ఏరియాలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని జనరల్ మేనేజర్ కార్యాలయంలో జిఎం జి దేవేందర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వివిధ గనుల్లో గని మేనేజర్లు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. అనంతరం సింగరేణి పాఠశాల మైదానంలో ఏర్పాటుచేసిన సెంట్రల్ ఫంక్షన్ కు ఏరియా జిఎం దేవేందర్ ముఖ్యఅతిథిగా హాజరై ఎస్ అండ్ పిసి సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా పాఠశాల మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. సింగరేణి సంస్థ నిర్దేశించిన వార్షిక లక్ష్యాన్ని అధిగమించేందుకు అధికారులు ఉద్యోగులు సమిష్టిగా కృషి చేసి లక్ష్యాలను సాధించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో రక్షణతో కూడిన నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి చేయాల్సిన బాధ్యత ప్రతి సింగరేణీయునిపై ఉందన్నారు. గతంతో పోలిస్తే ఏరియాలో బొగ్గు ఉత్పత్తి మెరుగు పడిందని వార్షిక లక్ష్యాన్ని అధిగమించేందుకు సమిష్టిగా కృషి చేసి లక్ష్యాలను అధిగమించాలని కోరారు. అనంతరం ఏరియాలో ఉత్తమ కార్మికులుగా ఎంపికైన కార్మిక దంపతులను ఆయన ఘనంగా సన్మానించి స్వీట్ బాక్సులు, బహుమతులు అందజేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఏరియా సేవా అధ్యక్షురాలు జి స్వరూపరాణి - దేవేందర్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సలెంద్ర సత్యనారా యణ, సీఎంవోఏఐ అధ్యక్షులు రమేష్, అన్నీ గనులు డిపార్ట్ మెంట్ ల మేనేజర్లు, హెచ్ఓడి లు, జిఎం కార్యాలయం అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.