- ఎమ్మెల్యే ‘గూడెం’పై భగ్గుమన్న హస్తం నేతలు
జాతీయ రహదారిపై ధర్నా
పటాన్‌చెరు, జనవరి 23 (విజయక్రాంతి): పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్ శ్రేణులను అణచివేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తూ గురు వారం ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ మేరకు గురువారం పటాన్‌చెరు జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి దూసుకెళ్లి కార్యాలయంలో గులాబీ రంగు కుర్చీలను ధ్వంసం చేశారు.
అనంతరం పార్టీ నేతలు మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ బీఫారంపై ఎమ్మెల్యేగా గెలిచిన మహిపాల్‌రెడ్డి కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారని, అయినప్పటికీ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ శ్రేణులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్‌వాదులను అణిచివేస్తూ, నియోజకవర్గంలో పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం స్పందించి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో పటాన్‌చెరు, రామంచద్రాపురం, అమీన్‌పూర్, జిన్నారం, గుమ్మడిదల మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.