రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): మొక్కలను నాటడం, వాటి పెంపకం, రక్షణకు తీసుకుంటున్న ప్రణాళికపై నివేదిక సమర్పించాలంటూ ప్రభుత్వానికి మంగళవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జనాభాకు తగ్గట్టుగా చెట్ల పెంపకం, పార్కులు, పచ్చదనం ఉండటంలేదని, పార్కులకు కేటాయించిన స్థలాల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ హిమాయత్‌నగర్‌కు చెందిన కే ప్రతాప్‌రెడ్డి దాఖలు చేసిన పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.
అదనపు అడ్వొకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ మొక్కల పెంపకం ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. 2022 77.87 లక్షల మొక్కలు నాటగా, 2023-24 ఇప్పటికే 72.28 లక్షల మొక్కలు నాటినట్టు చెప్పారు. 10 మేజరు పార్కులు, 1000 బయో పార్కులు, 10 మైదానం పార్కులు, 138 ట్రాఫిక్ కూడళ్లలో పార్కులను నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. పార్కుల నిర్వహణతోపాటు ప్రస్తుతం జరుగుతున్న మొక్కలు నాటే కార్యక్రమ ప్రణాళిక, నిర్వహణపై నివేదిక సమర్పించాలని ఆదేశించిన హైకోర్టు.. విచారణను 12కు వాయిదా వేసింది.