calender_icon.png 18 October, 2024 | 5:16 AM

దవాఖానల్లో సౌకర్యాలపై నివేదికివ్వండి

18-10-2024 03:02:31 AM

రాష్ట్రానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక వసతుల కల్పనపై నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఇటీవల నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ జరిగే ఈ నెల 23 నాటికి సమగ్ర నివేదికను అందజేయాలని ఆదేశించింది.

సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పుల ప్రకారం ప్రభుత్వ దవాఖానల్లో కనీస సదుపాయాలను కల్పించకపోవడంతోపాటు నియా మకాలు చేపట్టకపోవడాన్ని సవాల్ చేస్తూ కే అఖిల్ శ్రీగురుతేజ దాఖలు చేసిన పిల్‌పై చీఫ్ జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన డివిజన్ బెంచ్ ఇటీవల విచారణ చేపట్టింది.

పిటిషనర్ తరఫుఅడ్వొకేట్ చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టు తీర్పు, భారత వైద్య ప్రమాణాలు2022 ప్రకా రం ప్రభుత్వ జిల్లా దవాఖానలతోపాటు ఏరి యా హాస్పిటల్స్, పీహెచ్సీలు, కమ్యూనిటీ సెంటర్లలో, మెడికల్ కాలేజీలకు అనుబంధం గా ఉన్న జనరల్ దవాఖానల్లో తగినన్ని సౌకర్యాలు కల్పించాలని, ఖాళీలను భర్తీ చేయాలని, పారామెడికల్ సిబ్బంది కొరత ఉందని తెలిపారు.

ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది పొట్టిగారి శ్రీధర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. మౌలిక వసతుల కల్పనపై నివేదిక సమర్పించడానికి గడు వు కావాలని కోరారు. దీనికి ధర్మాసనం అనుమతిస్తూ వీటితోపాటు కన్సల్టేషన్ గదులు, డయాలసిస్ యూనిట్లు, హెచ్డీయు, ఐసీయు బెడ్లు, ఎస్‌ఎన్సీయు, ఎన్‌ఐసీయు బెడ్లు, రిజిస్ట్రేషన్ కౌంటర్లు, మందుల పంపిణీ కౌంటర్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఆస్పత్రుల్లో నర్సుల శాతం, సీటీస్కాన్, ఎక్స్‌రే, టెలిఫోన్, బ్లడ్ బ్యాంక్ సౌకర్యాల కల్పన, ఫిర్యాదుల పరిష్కార విభాగాల ఏర్పాటుపై కూడా నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ, విచారణను 23కి వాయిదా వేసింది.