calender_icon.png 15 November, 2024 | 2:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లేని చెక్‌పోస్టులకు అద్దె!

11-11-2024 01:43:04 AM

ఏడేళ్లుగా కోట్ల రూపాయల ప్రజాధనం బూడిదపాలు

  1. ఏడాదికి లక్షల్లో చెల్లిస్తున్న వాణిజ్య పన్నులశాఖ 
  2. రాష్ట్ర సరిహద్దుల్లో గతంలో 14 చెక్‌పోస్టులు
  3. భోరజ్ చెక్‌పోస్టు మినహా మిగతావన్నీ అద్దెవే 
  4. జీఎస్టీ తర్వాత అన్నీ రద్దు.. ఆగని చెల్లింపులు

హైదరాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ప్రస్తు తం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో లీకేజీలను అరికట్టి ఆదాయాన్ని పెంచుకోవాలని సర్కారు పదేపదే ఆయా శాఖలకు చెప్తోంది.

ఎప్పుడూ లీకేజీలపైనే దృష్టిపెడుతున్న సర్కారు.. సంస్థాగతంగా ప్రభుత్వం చేస్తు న్న వృథా ఖర్చులపై దృష్టి పెట్టడం లేద న్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ఏడేళ్ల క్రితం రద్దు చేసిన కమర్షియల్ ట్యాక్స్ చెక్‌పోస్టులకు వాణిజ్య పన్నుల శాఖ ఇంకా అద్దెలు చెల్లించడం నిర్లక్ష్యానికి అద్దంపడుతోంది.

ఆ చెక్‌పోస్టులతో ఎలాంటి ఉపయోగం లేకపోయి నా.. కమర్షియల్ ట్యాక్స్ విభాగం ఏటా వృథాగా రూ.లక్షల్లో అద్దె రూపంలో కడుతుందన్న ఆరోపణలు వినిపిస్తోన్నాయి.

13 చెక్‌పోస్టులకు కిరాయిలు 

రాష్ట్రంలో 2017కు ముందు వరకు 14 చెక్‌పోస్టులు చలామణిలో ఉండేవి. వీటిలో ఆదిలాబాద్ డివిజన్‌లోని భోర జ్ మినహా మిగతా 13 చెక్‌పోస్టులను అద్దె స్థలాల్లోనే కమర్షియల్ ట్యాక్స్ నిర్వహించేది. 2017లో పన్నుల విధానంలో పారదర్శకత కోసం కేంద్రం జీఎస్టీని తీసుకొచ్చింది. ఆ తర్వాత చెక్‌పోస్టులను ఎత్తివేశారు. అప్పటి నుంచి రాష్ట్రంలోని 14 చోట్ల ఎలాంటి కార్యకలాపాలు లేవు.

ఇప్పుడు ఆయా చోట్ల గతంలో చెక్‌పోస్టు ఉండేదన్న ఆనవాళ్లు కూడా లేని పరిస్థితి. ఆ స్థలాలను వాణిజ్య శాఖ ఉపయోగించుకోకున్నా.. ఉత్తి పుణ్యానికి అద్దెలు చెల్లిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఏడాదికి లక్షల రూపాయల ప్రజాధనం బూడిద లో పోసినట్టు అవుతుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎవరి ప్రయోజనం కోసం అద్దెలు?

13 చెక్‌పోస్టుల్లో ఒకదానికి నెలకు రూ.25 వేలు, మరోదానికి రూ. 20 వేలు, ఇంకోదానికి రూ.15వేలు ఇలా ఏరియాలను బట్టి అద్దెమారుతుంది. చెక్ పోస్టులు రద్దు చేసి ఏడేళ్లు అవుతుంది. అంటే ఏడేళ్లుగా 13 చెక్‌పోస్టులకు కలిపి వాణిజ్య పన్నుల శాఖ ఇప్పటివరకు రూ.2 కోట్ల పైనే కిరాయి చెల్లించినట్టు సమాచారం.

వాస్తవానికి చెక్‌పోస్టులను ఎత్తేసిన తర్వాత ఆయా ప్రాంతాల్లో కమర్షియల్ ట్యాక్స్ విభాగం ఎలాంటి కార్యకలాపాలను నిర్వహించడం లేదు. ఇసుమంత ఉపయోగం లేకుండానే ఖాళీ స్థలాలకు రూ.లక్షలు అద్దెలు కట్టడం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దీనికి తోడు చెక్‌పోస్టులను రద్దు చేసే వరకు అక్కడ ఉన్న సీసీ కెమెరాలు, తాత్కాలిక రూములు, కుర్చీలు, టేబుల్స్, ఇతర సామగ్రి కూడా ఏమయ్యిందో తెలియని పరిస్థితి. 14 కేంద్రాల్లో ఉన్న వీటి విలువ దాదాపు రూ.1.5 కోట్ల పైనే ఉండొచ్చని ఉద్యోగులు చెప్తున్నారు. 

ఆ ఉద్యోగులు ఎక్కడ? 

చెక్‌పోస్టుల నిర్వహణ సంగతి ఇలా ఉంటే.. 2017కి ముందు అక్కడ పనిచేసిన ఉద్యోగుల పరిస్థితి మరో విధంగా ఉంది. చెక్‌పోస్టులను రద్దు చేసిన తర్వాత వాటిల్లో పనిచేసే ఉద్యోగులను ప్రభుత్వానికి సరెండర్ చేసి.. ఇతర విభాగాల్లో నియమించాల్సి ఉంటుంది. కానీ, కమర్షియల్ ట్యాక్స్ విభాగం.. ఏడేళ్లుగా ఆ ఉద్యోగులను ప్రభుత్వానికి సరెండర్ చేయలేదని తెలుస్తోంది.

వారిని డిపార్ట్‌మెంట్‌లోనే అంతర్గత బదిలీ చేసి పోస్టింగ్ ఇచ్చారు. కానీ, రికార్డులు మాత్రం వీరు చెక్‌పోస్టుల్లో పని చేస్తున్నట్టు చెప్తున్నాయి. అంతేకాదు సర్వీస్ రూల్స్‌ను లేకుండా వారు విధులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. వీరి వ్యవహారంలో కాగ్ కూడా అభ్యంతరం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా చెక్‌పోస్టు ఉద్యోగులు 450 నుంచి 500 మంది వరకు ఉండొచ్చని తెలుస్తోంది.

ఈ ఏడేళ్లలో వీరికి వాణిజ్య పన్నుల శాఖ నుంచి దాదాపు వేతనాల రూపంలో రూ.10 కోట్లపైనే జీతాలు అంది ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చెక్‌పోస్టులే లేనప్పుడు వారు ఇంకా అక్కడ పని చేస్తున్నట్లు వేతనాలు ఇవ్వడంపై కాగ్ అభ్యంతరం చెప్పినట్లు తెలిసింది. చెక్‌పోస్టులు ఎత్తేయగానే.. వీరిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తే.. సర్కారు వారిని అవసరమైన విభాగాలకు కేటాయించే అవకాశం ఉండేది.

లేకుంటే, వీరికి చెక్‌పోస్టుల్లో పనిచేసిన అనుభవం ఉన్న కారణంగా అబ్కారీ, అగ్రికల్చర్ శాఖ పరిధిలో నిర్వహించే చెక్‌పోస్టుల్లో బదిలీ చేసి ఉండొచ్చు. తద్వారా ఆయా విభాగాల్లో ఖాళీలు భర్తీ అవుతాయి. నియామకాలు తగ్గుతాయి. సర్కారుకు జీతాల భారం తగ్గేది. కానీ, అలా చేయకపోవడం వల్ల ఇటు ఉద్యోగులు ఎదుగూబొదుగూ లేకుండా ఉండటంతోపాటు ప్రభుత్వానికి కూడా ఆర్థికంగా భారంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.