calender_icon.png 30 October, 2024 | 5:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలిక గర్భం తొలగించండి

06-07-2024 01:46:53 AM

అత్యాచార బాధితురాలి కేసులో హైకోర్టు ఉత్తర్వులు

హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): అత్యాచార బాధిత బాలిక అవాంఛనీయ గర్భం తొలగింపునకు హైకోర్టు అనుమతిచ్చింది. బాలిక గర్భం తొలగింపు వ్యవహారంపై మెడికల్ బోర్డు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా బాలిక, ఆమె తల్లి అనుమతి తీసుకుని పిండాన్ని తొలగించాలని సూచించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్‌రెడ్డి శుక్రవారం గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఉత్తర్వులు జారీ చేశారు.

బాలికపై ఆరు నెలలకుపైగా పది మంది కామాంధులు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక అవాంఛనీయ గర్భం తొలగింపు నిమిత్తం గాంధీ ఆస్పత్రికి వెళితే డాక్టర్లు నిరాకరించారు. దీంతో బాలిక తల్లి హైకోర్టులో దాఖలు చేసింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వసుధా నాగరాజ్ వాదిస్తూ.. ఏ పాపం తెలియని బాలిక కొందరు దుర్మార్గుల వల్ల గర్భం దాల్చిందన్నారు. అభంశుభం తెలియని వయసని, గర్భం తీయకపోతే ఆ బాలిక శారీరక, మానసిక వేదనకు లోనవుతుందని చెప్పారు. ఇరవై వారాల పిండాన్ని తొలగింపునకు గాంధీ వైద్యులు తిరస్కరించడం అన్యాయమన్నారు.

గైనకాలజిస్ట్, రేడియాలజిస్ట్ తదితర డాక్టర్లతో మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి తగిన చర్యలకు ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. బాధిత బాలిక ఆరోగ్య పరిస్థితులపై రిపోర్టు ఇవ్వాలని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను గతంలో ఆదేశించింది. తాజాగా ఆ రిపోర్టును సీల్ కవర్లో కోర్టుకు వైద్యులు అందజేశారు. దీనిని పరిశీలించిన హైకోర్టు, ఇది దారుణమైన విషయమని, ఇలాంటి సంఘటనలు బాధాకరమని పేర్కొంది. బాలిక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గర్భం తొలగింపునకు ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. బాలిక, ఆమె తల్లి అనుమతితో అబార్షన్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించింది.